రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై ఈటల వరుసపెట్టి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అటు టీఆర్ఎస్ నేతలు సైతం ఈటలకు కౌంటర్‌గా మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. అయితే వీరు ఎక్కడ సమావేశాలు పెట్టినా ఈటల వర్గీయులు వచ్చి అడ్డుకుంటుండటంతో రహస్యంగా భేటీలు పెడుతున్నారు
తెలంగాణ రాజకీయాలన్నీ ఇప్పుడు హుజురాబాద్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఈటల రాజేందర్ కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన దగ్గరి నుంచి హుజురాబాద్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై ఈటల వరుసపెట్టి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అటు టీఆర్ఎస్ నేతలు సైతం ఈటలకు కౌంటర్‌గా మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. అయితే వీరు ఎక్కడ సమావేశాలు పెట్టినా ఈటల వర్గీయులు వచ్చి అడ్డుకుంటుండటంతో రహస్యంగా భేటీలు పెడుతున్నారు. నిన్న వీణవంక మండలం కోర్కల్‌లో ఈటల అనుచరులు నిలదీశారనే వార్త మీడియాలో రావడంతో ఆదివారం జరిగిన సమావేశాల్లో మీడియాను అనుమతించలేదు. అయినప్పటికీ సమావేశంలో ఈటల అనుచరులు టిఆర్ఎస్ నాయకులను నిలదీసి.. ఎంఎల్సీ నారదాసు లక్ష్మణ్ రావు వాహనాన్ని అడ్డుకున్నారు.
Also Read:బీజేపీలో చేరేది ఖాయమేనా: ఢిల్లీకి ఈటల, వెంట ఏనుగు రవీందర్ రెడ్డి
కాగా ఈ రోజు జరిగిన సమావేశంలో ఈటలను పార్టీ నుండి సస్పెండ్ చేసిన తరువాత సమావేశాలు పెట్టాలని టీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు. లేనిపక్షంలో ఈటల నియోజకవర్గానికి వస్తే ఆయన కూడా పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన వెంట నడవాల్సి వస్తుందని కొందరు టీఆర్ఎస్ నాయకులను నిలదీశారు. అంతే కాకుండా సమావేశం అనంతరం చల్లు వద్ద ఈటల అనుచరులు ఎంఎల్‌సీ నారదాసు వాహనాన్ని అడ్డుకున్నారు. సమావేశానికి సంబంధించి తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని వారు నిలదీశారు. మరోవైపు కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే ఈ సమావేశాలు ఏంటని మండిపడ్డారు. అనంతరం ‘‘జై ఈటల’’ నినాదాలు చేశారు. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈటల అనుచరులను అక్కడి నుండి పంపించివేశారు.
