హైదరాబాద్: డీసిసిబి ఎన్నికలు అధికార పార్టీలో నేతల మధ్య అధిపత్య పోరుకు తెరలేపుతున్నాయి. పలు జిల్లాల్లో అమాత్యులు తమ అనుచరులకు పదవులు దక్కేలా పావులు కదుపుతున్నారు. 

అతి తక్కువ మంది ఓటర్లుండే సహకార సంఘాల ఎన్నికల్లో ముందు నుంచి మంత్రులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది.

ఉమ్మడి జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసే సహకార సంఘాల జిల్లా చైర్మన్ పదవికి పోటీ తీవ్రంగా ఉంది. పలు జిల్లాల్లో తమ తమ అనుచరులను ఆ పీఠంపై కూర్చొబెట్టేందుకు మంత్రులు  తెరవెనుక చక్రం తిప్పుతున్నారు. 

నల్గొండ జిల్లాలో మంత్రి జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు తమ అనుచరలకు చైర్మన్ పదవి ఇప్పించుకునేందుకు  ప్రయత్నాలు చేస్తున్నారు.  పల్లా రాజేశ్వర్ రెడ్డి సూచిస్తున్న అభ్యర్థికి మండలి చైర్మన్ గుత్తాకూడా మద్దతు  పలుకుతున్నట్లు తెలుస్తోంది.   

Aslo read:తెలంగాణ ఉద్యమ సూరీడు: కేసీఆర్ చరిత్ర ఇదీ

మహబూబ్ నగర్ జిల్లాలో  నిరంజన్ రెడ్డి తన అనుచరులైన ముగ్గురు పేర్లను, శ్రీనివాస్ గౌడ్  కూడా మూడు పేర్లను పార్టీ పెద్దల ముందుంచినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసిఆర్ మాత్రం  కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డికి డిసిసిబి చైర్మన్ పదవి ఇస్తారని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
దీంతో మంత్రుల అనుచరుల్లో వైస్ చైర్మన్ పదవి మాత్రం ఒకరికి దక్కే అవకాశం కనిపిస్తోంది.

 నిజామాబాద్ జిల్లాలో నలుగురు నేతల మధ్య ఎవరికి  చైర్మన్ పదవి వరిస్తుందన్నది ఆసక్తి రేపుతోంది.  మంత్రి ప్రశాంత్ రెడ్డి, స్సీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిలు    ప్రయత్నాలు చేస్తుండగా ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేష్ గుప్తాలు కూడా తమ అనుచరులకు పదవి ఇవ్వాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ను కోరుతున్నారు.  

నలుగురు నేతలు నాలుగు పేర్లను డిసిసిబి పదవికి సూచిస్తుండడంతో పార్టీ పెద్దలు ఎవరిని ఈ పదవికి ఎంపిక చేస్తారో ఆసక్తి రేపుతోంది.వరంగల్, రంగారెడ్డి, మెదక్, అదిలాబాద్ జిల్లాల్లో మాత్రం డిసిసిబి చైర్మన్  పదవికి పోటీ ఉన్నా  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆయా జిల్లాల నేతలకు అనధికారికంగా సమాచారం  ఇప్పటికే ఇచ్చినట్లు పార్టీ నేతలంటున్నారు. త్వరలో అన్ని జిల్లాల సహకార బ్యాంకు చైర్మన్ లను పార్టీ  అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.