తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని టీఆర్ఎస్ నేతలు కలిశారు. హైదరాబాద్‌లో విధ్వంసానికి బీజేపీ నేతలు కుట్ర పన్నారని ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ ముగిసిన కాసేపటికే టీఆర్ఎస్ నేతలు డీజీపీని కలిసి వినతి పత్రం అందజేశారు.

అంతకుముందు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్ ఎల్లుండి ఎన్నిక కావడంతో ఈరోజు చివరి కుట్రకు తెరదీసిందని ఆయన వెల్లడించారు. తమకు అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. ఓ బీజేపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశారు.

Also Read:యువకుడి ఆత్మహత్యాయత్నం.. రేపు సంజయ్ ప్లాన్ ఇదే: కేటీఆర్ వ్యాఖ్యలు

దీనిని బేస్‌గా తీసుకుని రేపు ఉదయం హైదరాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రగతి భవన్, డీజీపీ ఆఫీస్, తెలంగాణ భవన్‌లను ముట్టడించాలని బండి సంజయ్ సమాచారం ఇస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

సాధారణ ముట్టడిలాగా కాకుండా లాఠీఛార్జీ, లేదంటే పోలీసు కాల్పుల దాకా విషయం వెళ్లాలని సంజయ్ ఎత్తుగడ వేశారని మంత్రి ఆరోపించారు. అయితే తాము శాంతిభద్రతల విషయంలో తాము రాజీపడే సమస్యే లేదని అందుకే దీని గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు కేటీఆర్ చెప్పారు.

అంతేకాకుండా డీజీపీ, రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌‌ను టీఆర్ఎస్ బృందం కలుస్తుందన్నారు. ఆరేళ్లుగా ప్రశాంతంగా వున్న హైదరాబాద్‌లో ఆ వాతావరణానికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఉక్కుపాదంతో అణచివేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. సొంత పార్టీ కార్యకర్తలను తూటాలకు ఎదురుగా నిలబెట్టి లాభం పొందాలని చూస్తున్నారని మంత్రి ఆరోపించారు.