దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో నాయకులు మధ్య మాటల యుద్ధం తారాస్ధాయికి చేరుకుంది. ముఖ్యంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్- మంత్రి హరీశ్ రావుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీన్‌లోకి మంత్రి కేటీఆర్ వచ్చారు.

సిద్దిపేట జిల్లా కేంద్రంలో నాలుగు చోట్ల ఒకే రోజు సోదాలు జరిగాయని.. ఇద్దరు బీజేపీ నేతలు, ఇద్దరు టీఆర్ఎస్ నేతల ఇళ్లపై దాడులు జరిగాయి. కానీ ఒకేరోజు 8 మంది బీజేపీ నాయకుల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని.. టీఆర్ఎస్ నేతల ఇళ్లపై జరగడం లేదంటూ అసత్య ప్రచారం జరుగుతోందని కేటీఆర్ మండిపడ్డారు.

డబ్బు దొరికినప్పటికీ అది తమది కాదంటూ బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారని ఎద్దేవా చేశారు. ఎక్కడైతే డబ్బులు దొరికాయో స్వయంగా ఆ ఇళ్లలోని మహిళలే వీడియోల్లో చెప్పడంతో బీజేపీ నాయకుల యత్నం విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు.

సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ.. విస్త్రృతంగా దుష్ప్రచారం చేస్తున్నారని.. దీనిని టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగంతో పాటు మంత్రి హరీశ్ రావు, కేసీఆర్ బయటపెట్టారని కేటీఆర్ తెలిపారు.

Also Read:నగదుతో అరెస్టైన వారికి బీజేపీ నేత రఘునందన్‌రావుతో సంబంధాలు: సీపీ అంజనీకుమార్

ఎల్లుండి ఎన్నిక కావడంతో ఈరోజు చివరి కుట్రకు తెరదీసిందని ఆయన వెల్లడించారు. తమకు అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. ఓ బీజేపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశారు.

దీనిని బేస్‌గా తీసుకుని రేపు ఉదయం హైదరాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రగతి భవన్, డీజీపీ ఆఫీస్, తెలంగాణ భవన్‌లను ముట్టడించాలని బండి సంజయ్ సమాచారం ఇస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

సాధారణ ముట్టడిలాగా కాకుండా లాఠీఛార్జీ, లేదంటే పోలీసు కాల్పుల దాకా విషయం వెళ్లాలని సంజయ్ ఎత్తుగడ వేశారని మంత్రి ఆరోపించారు. అయితే తాము శాంతిభద్రతల విషయంలో తాము రాజీపడే సమస్యే లేదని అందుకే దీని గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు కేటీఆర్ చెప్పారు.

అంతేకాకుండా డీజీపీ, రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌‌ను టీఆర్ఎస్ బృందం కలుస్తుందన్నారు. ఆరేళ్లుగా ప్రశాంతంగా వున్న హైదరాబాద్‌లో ఆ వాతావరణానికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఉక్కుపాదంతో అణచివేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. సొంత పార్టీ కార్యకర్తలను తూటాలకు ఎదురుగా నిలబెట్టి లాభం పొందాలని చూస్తున్నారని మంత్రి ఆరోపించారు.