టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో కొండా సురేఖ పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు జిల్లా నాయకులపై విమర్శల వర్షం కురిసిస్తున్నారు.  తెలంగాణ ప్రభుత్వానికి గానీ టీఆర్ఎస్ పార్టీకి గానీ వ్యతిరేకంగా తాము పనిచేయలేదని అలాంటిది తమకు టికెట్ ఇవ్వకపోడానికి కారణాలు చెప్పాలని  కొండా సురేఖ కేసీఆర్ ను ప్రశ్నించారు. అంతేకాదు జిల్లా నాయకులు తమకు సీటు రాకుండా అడ్డుకున్నారంటూ ఎర్రబెల్లి దయాకరరావుపై పరోక్ష విమర్శలు చేశారు. ఈ ఆరోపణలపై ఎర్రబెల్లి దయాకరరావు స్పందించారు.

తాను ఎవరి రాజకీయాల్లోనూ తలదూర్చడం లేదని, నియోజకవర్గ అభివృద్ది కోసం మాత్రమే పనిచేస్తున్నానని ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా  పనిచేశాను కాబట్టే ప్రజలు తనను నమ్ముతున్నారనీ... అందువల్లే ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేసినా గెలిపించారన్నారు. కొండా దంపతులకు టికెట్ రాకపోవడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. అసలు తనకు ఎవరూ ప్రత్యర్థులు లేరని...కొండా దంపతులు కూడా తన ప్రత్యర్థులు కారన్నారు. ఉనికి కోసమే కొందరు తనను ప్రత్యర్థిగా భావిస్తూ ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. 

 కాంగ్రెస్, టిడిపి పొత్తులపై ఎర్రబెల్లి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే టిడిపి పార్టీ ఆవిర్భవించిందని ఇప్పుడు ఇలా పొత్తుల పేరుతో కలిస్తే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని విమర్శించారు.

ఇక కొండా దంపతుల వ్యవహారంపై టీఆర్ఎస్ నాయకురాలు గుండు సుధారాణి స్పందించారు. బిసి మహిళలకే కాదు యావత్ తెలంగాణ మహిళలకు కేసీఆర్ అండగా నిలుస్తున్నారని సుధారాణి ప్రశంసించారు. తాను కూడా  ఓ బిసి మహిళా నాయకురాలినేనని, తనకు సముచిత స్థానం కల్పించారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు గౌరవించడంతో ముందుటారని స్పష్టం చేశారు.

కేసీఆర్ పై కొండా దంపతుల చేసిన విమర్శలను సుధారాణి ఖండించారు. కేసీఆర్ కుటుంబంపై అనవసర వ్యాఖ్యలే చేయడం మానుకోవాలని  ఆమె కొండా దంపతులకు సూచించారు.  స్థానికురాలు కాకున్నా వరంగల్ తూర్పు నుండి ఆమెను బరిలోకి దింపి రాజకీయ బిక్షపెట్టిన కేసీఆర్ ను విమర్శించడం తగదని గుండు సుధారాణి సూచించారు. 

 

సంబంధిత వార్తల కోసం కింది లింక్స్ క్లిక్ చేయండి

తెల్లారి నుంచి కేటీఆర్ ఫోన్ ఎత్తరు, ఆగం పట్టిస్తున్నారు: కొండా సురేఖ

బీసీ మహిళను అవమానించారు, కన్నీళ్లు పెట్టుకున్నా: కొండా సురేఖ

జగన్ ను ఒక్కసారే కలిశా, అలా చేసి ఉండకపోతే: కొండా సురేఖ