బీజేపీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది టీఆర్ఎస్. మునుగోడులో ఓటర్లకు పంచేందుకు గాను బీజేపీ రూ.5.22 కోట్లను పలువురి ఖాతాల్లో నగదు జమ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు నగదు డిపాజిట్ చేసిన ఖాతాల వివరాలను ఈసీకి అందజేసింది. 

మునుగోడు ఉపఎన్నికతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. ప్రచారంలో మాటల యుద్ధానికి తోడు.. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పెద్ద దుమారం రేపింది. ఈ నేపథ్యంలో శనివారం కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. మునుగోడులో ఓటర్లకు పంచేందుకు గాను బీజేపీ రూ.5.22 కోట్లను పలువురి ఖాతాల్లో నగదు జమ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. డబ్బులు వేసిన 23 బ్యాంక్ ఖాతాల వివరాలను ఈసీకి అందజేసింది టీఆర్ఎస్. ఈ 23 బ్యాంక్ ఖాతాలు మునుగోడులోనివేనని తెలిపింది. 

అయితే బీజేపీ ముందు నుంచే టీఆర్ఎస్‌పై ఫిర్యాదులు చేస్తున్న సంగతి తెలిసిందే. మునుగోడు ఉపఎన్నికను ప్రభావితం చేసేలా టీఆర్ఎస్ ప్రవర్తిస్తోందని ఇందులో భాగంగానే ఫామ్‌హౌస్ డ్రామా ఆడిందంటూ గురువారం సీఈవోకి ఫిర్యాదు చేసింది బీజేపీ నేత రచనా రెడ్డి బృందం. టీఆర్ఎస్ అక్రమాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అడ్డుకోలేకపోతోందని ఆరోపిస్తోంది. ఇప్పటికే తరుణ్ చుగ్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయగా.. ఇటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. 

ALso REad:మునుగోడు ఉపఎన్నిక.. టీఆర్ఎస్‌పై బీజేపీ న్యాయపోరాటం, ఈసీకి ఫిర్యాదుల వెల్లువ

ఇకపోతే.. బుధవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. మునుగోడు ఎన్నికల్లో నకిలీ నోట్లను తొలగించాలని కేంద్ర ఎన్నికల కమీషన్ దృష్టికి ప్రదాన్ తీసుకెళ్లారు. ఇప్పటికే 12 వేల నకిలీ ఓట్లను తొలగించారని, మరో 14 వేల ఓట్లు తొలగించాల్సి వుందని చెప్పారు. అలాగే మునుగోడు ఎన్నికలో డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారని ... ప్రభుత్వ వాహనాలను కూడా ఇష్టానుసారంగా ఉపయోగిస్తున్నారని ఫిర్యాదు చేశారు ధర్మేంద్ర ప్రదాన్.