హైదరాబాద్: ఎంత సర్దిచెబుకున్నా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో పరిస్థితి అంత సజావుగా లేదనేది అర్థమవుతోంది. హరీష్ రావును మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం, ఈటల రాజేందర్ ధిక్కార స్వరం టీఆర్ఎస్ లో ఏదో జరుగుతోందనే సంకేతాలను ఇస్తూనే ఉంది. 

తాజాగా ఓ టీఆర్ఎస్ నేత చేసిన పని ఆ విషయాన్ని మరింతగా పట్టిస్తోంది. హరీష్ రావు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ టీఆర్ఎస్ నేత విష్ణు జోగుళాంబ గుడిలో 1016 కొబ్బరికాయలు కొట్టారు. విష్ణు ఏ స్థాయి నాయకుడనేది తెలియదు కానీ ఓ విధమైన చర్చకు మాత్రం ఆయన చర్య దారి తీస్తోంది. 

హరీష్ రావును దమ్మున్న నాయకుడిగా విష్ణు అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం హరీష్ రావు ఎంతో కష్టపడ్డారని, ప్రారంభోత్సవానికి హరీష్ రావును పిలువకపోవడం సరి కాదని ఆయన అన్నారు.  విష్ణు వ్యాఖ్యలపై హరీష్ రావు ఏ విధంగా ప్రతిస్పందిస్తారనే ఆసక్తి చోటు చేసుకుంది.

ఈటల రాజేందర్ విషయంలో కేసీఆర్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ ఆ మంట చల్లారేది కాదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చేసిన పరోక్ష వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. మొత్తం మీద టీఆర్ఎస్ లో అంతర్గతంగా ఏదో జరుగుతుందనే ప్రచారం మాత్రం ముమ్మరంగానే సాగుతోంది.