హుజురాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిజంగానే అభినవ పూలే అయితే అట్టడుగు వర్గాల భూములు ఈయనకు ఎందుకు? అని బీసీ కమిషన్ మాజీ సభ్యులు వకుళాభరణం క్రిష్ణమోహన్ రావు ఆరోపించారు. ఆత్మగౌరవం అంటే వ్యాపారాలు పెంచుకోవడమేనా? అంటూ ఈటలను వకుళాభరణం ఎద్దేవా చేశారు. 

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో బుధవారం వకుళాభరణం కృష్ణమోహన్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం ఈటల రాజేందర్ వెంట ఎవరూ లేరన్నారు. ఓడిపోతాననే భయంతోనే ఈటల రాజీనామా చేయడం లేదన్నారు.

''సీఎం కేసీఆర్ పై ఈటల చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. తనపై రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేసిందని ఈటల విమర్శించడం చేయడం తగదు. సంక్షేమ హాస్టళ్లలో చదువుకున్న నిన్ను ఈ స్థాయి కి తెచ్చిన కేసీఆర్ నే విమర్శిస్తావా?'' అంటూ మండిపడ్డారు.

''అక్రమాలకు పాల్పడినందుకు చర్యలు తీసుకుంటే బిసీలకు ద్రోహం చేసినట్టా..? నిజంగానే నీవు బడుగుల నాయకుడివే అయితే వారి అభివృద్ధికి ఎందుకు పాటు పడలేదు. అలా చేయకపోగా వారి భూముల్ని లాక్కున్నావు. బడుగుల బలహీన వర్గాల పేరు చెప్పి ఆస్తులు సంపాదించావు. నీ తాపత్రయం బడుగుల కోసం కాదు.... ఆస్తుల కోసమే'' అని వకుళాభరణం విమర్శించారు. 

read more  నేను ఈటలను కలవలేదు, ఫోన్లో మాట్లాడానంతే.... కిషన్ రెడ్డి క్లారిటీ..

''కేసీఆర్ వెంటే ఉంటామని చెప్తున్న వారిని అమ్ముడు పోయారనడం సరి కాదు. ధర్మం, న్యాయం, నీతి టీఆర్ఎస్ లో ఉంది. మంత్రి హోదాలోనే ఈటల ధిక్కార స్వరం వినిపించారు.  ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనుకుంటేనే బర్తరఫ్ చేశారు. ఇకపైన సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం'' అని ఈటలను వకుళాభరణం హెచ్చరించారు. 

 ''హుజురాబాద్, కమలాపూర్ ప్రాంత ప్రజల వల్లే ఈటల ఈ స్థాయికి ఎదిగారన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. నిజాలు ఒప్పుకునే మనస్తత్వం లేని ఈటల.. పెంపుడు మిత్రులతో సోషల్ మీడియా వేదికగా చేస్తున్న తప్పుడు ప్రచారాలను మానుకోవాలి'' అని వకుళాభరణం హితవు పలికారు.