టిఆర్ఎస్ లో భగ్గుమన్న అసంతృప్తి

టిఆర్ఎస్ లో భగ్గుమన్న అసంతృప్తి

పవన్ కేసిఆర్ భేటీ విషయంలో టిఆర్ఎస్ కేడర్ గుర్రుగా ఉన్నారా? పార్టీ కోసం, తెలంగాణ కోసం పనిచేసిన తమను గాలికొదిలేశారని వారు సీరియస్ గా ఉన్నారా? తమను కాదని పవన్ లాంటి వాళ్లకు అపాయింట్ మెంట్ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారా? పార్టీ నేతలు ఓపెన్ గానే తమ ఆగ్రహాన్ని వెల్లగక్కుతున్నారా? అంటే.. పార్టీ శ్రేణుల తీరు చూస్తే   అవుననే అనిపిస్తోంది.

జనవరి 1వ తేదీనాడు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ సిఎం కేసిఆర్ తో గంటన్నర పాటు భేటీ అయ్యారు. ప్రగతిభవన్ కు పోయిన పవన్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. అతి కొద్ది మందికి మాత్రమే ప్రవేశం లభించే ప్రగతి భవన్ లోని సిఎం నివాస భవనంలో ఈ సమావేశం జరగడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఈ సమావేశం తర్వాత పవన్ మీడియాతో మాట్లాడి కేసిఆర్ ను అభినందించారు. 24 గంటల వ్యవసాయ విద్యుత్ ఒక వండర్ అని పొగడ్తలతో ముంచెత్తారు. ఇదంతా బాగానే ఉంది. ఇక్కడినుంచి అసలు సీన్ షురూ అయింది.

టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటైన నాటినుంచి నేటి వరకు కేసిఆర్ అనే నేత కార్యకర్తలెవరికీ అందుబాటులో ఉండరు అన్న విమర్శ ఉంది. ఆయన అనుకుంటేనే అపాయింట్ మెంట్ దొరుకుతుంది. కాదనుకుంటే అవతలివారు ఎంత గొప్ప వారు కానీ.. వారు ఎవరు కానీ అపాయింట్ మెంట్ ఇచ్చే ప్రశ్నే లేదు అని చెబుతారు. తుదకు ఆయన సహచరులకు కూడా పలు సందర్భాల్లో ఇలాంటి చేదు అనుభవాలున్నాయి. మొన్నటికి మొన్న మాజీ లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ హైదరాబాద్ వచ్చి కేసిఆర్ ను కలిసి తనకు రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోరే ప్రయత్నం చేశారు. ఆమెను కలవడం కాదు కదా.. కనీసం ఫోన్ లో కూడా కేసిఆర్ ఆమెకు అందుబాటులోకి రాలేదు. అంతేకాదు పార్టీ నేతలెందరో కేసిఆర్ ను ఒక్కసారి కలుసుకుంటే జన్మ ధన్యమైపోతదన్న ఆశతో వేలాది మంది ఉన్నారు. కానీ.. వారెవరికీ అంత సులువుగా కేసిఆర్ దర్శనం దొరకడంలేదని చెప్పుకుంటున్నారు. 

ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. కేసిఆర్ పెద్ద పెద్ద లీడర్లకే అందుబాటులో ఉండరు అన్న విమర్శ ఎంత ఉందో... అత్యంత సామాన్యులకు సైతం ఆయన అపాయింట్ మెంట్ ఇచ్చి గంటల తరబడి వారితో సమావేశమవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ విలక్షణమైన వైఖరిని కేసిఆర్ ముందునుంచీ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కేడర్ లో మాత్రం తీవ్రమైన అసంతృప్తి ఉంది. తమను పార్ట అధినేత కలుసుకోవడంలేదని వారు ఆవేదనతో ఉన్నారు.

సోమవారం పవన్ కళ్యాణ్ కు నివాస భవనంలో అతిథిమర్యాదలు చూసిన తర్వాత పార్టీలో ఇంతకాలం అసంతృప్తితో ఉన్న వారంతా ఓపెన్ గానే విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మహిళా నేత వసుంధర సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ ను ప్రగతి భవన్ లోకి రానిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్ భవన్ లో పవన్, కేసిఆర్ ఆసక్తిగా ముచ్చటించే విషయంలో  వెలువడిన ఫొటోను సైతం విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

కార్యకర్తలు ఎంతగానో ఎదురుచూసినా.. అపాయింట్ మెంట్ ఇవ్వకుండా పవన్ కు ఎలా ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. అంతేకాదు కేసిఆర్ అంతరంగికుడు, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సంతోష్ కుమార్ ను సైతం ఆమె విమర్శించారు. ఈ విషయంలో సంతన్న ఎందుకు అపాయింట్ మెంట్ ఇప్పించారని నిలదీశారు. సంతోష్ పై ఘాటుగానే కామెంట్స్ ను పోస్టు చేశారు. వసుంధర పెట్టిన పోస్టులోని వివరాలు కింద చదవొచ్చు..

చిన్న జీవి పెద్ద జీవి అని ఆడిపోసుకుని ఇప్పుడు గిదేమి కథ సర్? ఇటువంటోలకోసమా తెలంగాణ సాధించుకుంది? ఇదేమి ఖర్మరా బాబు???? సంతన్న ఇలాంటోలకు జల్ది appointment fix చేస్తాడు..సంతన్న మొఖంలో సంబరం చూడండి...తెలంగాణ ఇచ్చినందుకు బాగ ఏడ్సినోడు ఇప్పుడు తెలంగాణలో పోటి చేస్తాడట పవనాలు....దానికి ఇదే ఆహ్వానము...

వసుంధర లాంటివాళ్లు అనేక మంది టిఆర్ఎస్ పార్టీలో మింగలేక కక్కలేక ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కీలకమైన పదవుల్లో ఉన్నవారికి సైతం ఈ మూడేళ్లకాలంలో ఒక్కసారి కూడా అపాయింట్ మెంట్ దక్కలేదన్న ప్రచారం ఉంది. ‘‘పదవి ఇచ్చిన నాడు తప్పితే ఇప్పటి వరకు నాకు పెద్దాయన అపాయింట్ మెంట్ దొరకలేదు.. పట్టుమని పది నిమిషాలు మాట్లాడే వెసులుబాటు రాలేదు...’’ అని ఒక పెద్ద పోస్టులో ఉన్న నాయకుడు ఇటీవల మీడియా మిత్రుల వద్ద సరదగా వ్యాఖ్యానించారు. దానికి మీకు పదవి ఇచ్చిన నాడు మాట్లాడారు.. కానీ చాలా మంది పదవులు లేక.. అధినేత కరుణ లేక బాధపడేవారు కూడా ఉన్నారుగా అని సమాధానమిచ్చారు. ఈ తరహా పరిస్థితులు టిఆర్ఎస్ లో కొంతమేరకు కలవరం రేపుతున్నాయి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page