Asianet News TeluguAsianet News Telugu

సింగరేణి నిర్వీర్యానికి కుట్ర ఇలా.. వేలం పాటతో స్కెచ్ , టెండర్ షెడ్యూల్ ఇదే : వినోద్ కుమార్

సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు టీఆర్ఎస్ నేత, తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్. ప్రైవేటీకరణకు, వేలం పాటకు మధ్య ఉన్న తేడాను ఇప్పటికైనా బండి సంజయ్ గ్రహించాలని ఆయన చురకలంటించారు.

trs leader boinapally vinod kumar slams bjp led center over singareni privatization
Author
First Published Dec 4, 2022, 8:45 PM IST

బొగ్గు గనులను వేలం వేసే ప్రక్రియ శరవేగంగా సాగుతోందని .. కేంద్ర ప్రభుత్వం టెండర్ షెడ్యూల్ ను తాజాగా ప్రకటించిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణిని ప్రైవేటుపరం చేయమని ఒక వైపు చెబుతూనే.. సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం టెండర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని ఎద్దేవా చేశారు. ఈ టెండర్ ప్రక్రియకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం సమాధానం చెబుతారు అని వినోద్ కుమార్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణిలో 51% శాతం వాటా ఉందని, కేంద్ర ప్రభుత్వానికి కేవలం 49 శాతం వాటా ఉందని, అలాంటప్పుడు సింగరేణి సంస్థను తాము ప్రైవేట్ పరం ఎలా చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని వినోద్ కుమార్ గుర్తుచేశారు. కానీ ఆచరణలో మాత్రం వ్యవహారం అందుకు భిన్నంగా ఉందని ఆయన దుయ్యబట్టారు.

సింగరేణి సంస్థ జోలికి వెళ్ళమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన మాటలకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న బొగ్గు గనుల వేలంపాటల ప్రక్రియకు ఎక్కడా కూడా పొంతన లేదని ఆయన ధ్వజమెత్తారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ బొగ్గు గనుల బ్లాకులను యథేచ్చగా టెండర్ ప్రక్రియ ద్వారా వేలం వేస్తున్న కేంద్ర ప్రభుత్వ అసలు రంగు బట్టలు అయిందని వినోద్ కుమార్ మండిపడ్డారు. గత నెల 3 వ తేదీ నుంచి ప్రారంభమైన బొగ్గు గనుల బ్లాకుల వేలం పాటల పరంపర వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వ తేదీ వరకు కొనసాగనుందని ఆయన తెలిపారు. సింగరేణి సంస్థకు బొగ్గు గనులు దక్కకుండా చేస్తూనే, వ్యూహాత్మకంగా వ్యవహరించి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా ముందుకు సాగుతోందని వినోద్ కుమార్ ఆరోపించారు. 

కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ పట్ల అనుసరిస్తున్న అనుచిత వైఖరిని, బొగ్గు గనుల వేలం పాటల పరంపరను ముందుగానే తాను హెచ్చరించానని ఆయన గుర్తుచేశారు. కానీ . కేంద్ర ప్రభుత్వం, కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, రాష్ట్ర బిజెపి నాయకులు బుకాయించారని వినోద్ కుమార్ మండిపడ్డారు. బొగ్గు గనుల బ్లాకుల వేలం వేసే టెండర్ షెడ్యూల్ గురించి ఇప్పుడేం చెబుతారని వినోద్ కుమార్ ప్రశ్నించారు. సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు జరుగుతున్న కుట్రను ఇప్పటికైనా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గ్రహించాలని , కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఇలాంటి కుట్రలను అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థకు బొగ్గు గనులు దక్కకుండా చేసి నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కోల్ బ్లాక్స్ ను వేలం పాట ద్వారా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు ముందుకు సాగుతోందని వినోద్ కుమార్ ఆరోపించారు.

ALso Read:బొగ్గు గనుల కమర్షియల్ వేలానికి కేంద్రం శ్రీకారం.. లిస్ట్‌లో సింగరేణిలోని నాలుగు

ప్రైవేటీకరణకు, వేలం పాటకు మధ్య ఉన్న తేడాను ఇప్పటికైనా బండి సంజయ్ గ్రహించాలని, కళ్ళు తెరిచి వాస్తవాలను తెలుసుకోవాలని ఆయన చురకలంటించారు. ఇప్పటికే సింగరేణి సంస్థకు బొగ్గు గనుల బ్లాకులు దక్కకుండా ఆగస్ట్ 10 వ తేదీ నాడు నిర్వహించిన వేలం పాటలో ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని కోయలగూడెం - lll కోల్ బ్లాక్ ను ఔరో కోల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం  అప్పగించిందని వినోద్ కుమార్ గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా సింగరేణి సంస్థకు బొగ్గు గనులు దక్కకుండా చేయడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. 

కోల్ బ్లాక్స్ చేతిలో లేకుంటే సింగరేణి సంస్థ ఏం పని చేయాలి అని వినోద్ కుమార్ ప్రశ్నించారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న సుమారు 60,000 వేల మంది కార్మికులు, ఉద్యోగులను రోడ్డు పాలు చేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రైవేటీకరణ అనే పదం ఉపయోగించకుండా పక్కా స్కెచ్ వేసి కోల్ బ్లాక్స్ ను వేలం వేస్తూ సింగరేణి సంస్థను పరోక్షంగా మూత వేసేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోందని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios