Telangana: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారుపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. అధికార పార్టీ తెలంగాణను డ్రగ్స్ అడ్డగా మారుస్తున్నదని మండిపడ్డారు.
Revanth Reddy: రాష్ట్రంలో హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షలు తీవ్ర విమర్శలు చేస్తుండటంతో ఇప్పుడు.. ఇది రాజకీయ రంగును పులుముకుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్ సర్కారు తెలంగాణను పంజాబ్ రాష్ట్రంలా డ్రగ్స్ అడ్డాగా మారుస్తోందని ఆరోపించారు.
బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజాలోని పుడ్‌డింగ్, మింక్ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేయడంతో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వందల మంది అక్కడ డ్రగ్స్ తో పార్టీ చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే చాలా మందిని పోలీసులు విచారించారు. అయితే, దీనిపై ప్రభుత్వం పారదర్శకంగా ముందుకుసాగడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ రేవంత్ రెడ్డి మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు. యువత, విద్యార్థుల భవిష్యత్తుతో టీఆర్ఎస్ ప్రభుత్వం చెలగాటమాడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు. అసలు నిందితులను పట్టుకోవడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ప్రజలు వివిధ కారణాల వల్ల పబ్బులకు వెళతారు. కొందరు డ్రగ్స్ కోసం, మరికొందరు మద్యం కోసం, మరికొందరు ఆహారం కోసం, మరికొందరు స్నేహితులను కలవడానికి వెళతారు. ఎవరు ఏం చేశారో తేల్చడం దర్యాప్తు సంస్థల కర్తవ్యం. మీరు వారందరినీ పరీక్షించి తెలుసుకోగలిగిన ప్రభుత్వం అందరినీ ఎందుకు వదిలిపెట్టింది? యువ విద్యార్థులను షీల్డ్‌లుగా ఉపయోగించుకోవడం ద్వారా మీరు ఏమి కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు?" అని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పబ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిలో ఒకరైన ప్రణయ్ రెడ్డి.. రేవంత్ రెడ్డికి బంధువు అని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. దీనిపై రేవంత్ స్పందిస్తూ.. ప్రణయ్‌ని ఏ దర్యాప్తు సంస్థకైనా రప్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అతడి రక్తం, వెంట్రుకలు, మూత్రం నమూనాలను సమగ్ర విచారణకు సమర్పించేలా చూసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
“మీరు అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. మేము అతనిని విడుదల చేయాలని డిమాండ్ చేసామా? సమగ్ర విచారణ జరగాలి'' అని అన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను ఆదేశించాలని రేవంత్ డిమాండ్ చేశారు. "ఈ అంశంపై విచారణ జరిపించాలని కేసీఆర్ కేంద్రానికి లేఖ రాయాలి. మా పిల్లలపై వస్తున్న ఆరోపణలపై పారదర్శకంగా విచారణ జరపాలి" అని ఆయన స్పష్టం చేశారు. విచారణ పారదర్శకత కోసం తన కుమారుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు నమూనాలను సమర్పించాలని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. “నేను మా పిల్లలందరి నమూనాలను సమర్పించేలా చూస్తాను. నీ కొడుకు శాంపిల్స్‌తో నువ్వు కూడా అలాగే చేయగలవా?” అని రేవంత్ ప్రశ్నించారు.