ఈ రోజు   ముఖ్యమంత్రి గాని, విద్యాశాఖ మంత్రి  గాని ఈ క్యాంపస్ లో కాలు పెట్టే స్థితిలో లేరు, ఎందుకు?

1969 లో ఉస్మానియా విద్యార్థులు జై తెలంగాణా అన్నప్పటి నుంచి తెలంగాణాలో వచ్చిన ప్రతి విద్యార్థి ఉద్యమం ఉస్మానియా కనుసన్నల్లోనే జరిగింది.

రాష్ట్రానికి రాజధాని హైదరాబాద్ రాష్ట్ర విద్యార్థి ఉద్యమాలకురాజధాని ఉస్మానియా. ప్రత్యేక తెలంగాణా ఉద్యమమయినా రాడికల్ ఉద్యమాలయినా ఉస్మానియా గాలి పీల్చుకునే పెరిగిపెద్దదయ్యాయి. చివరకు ఎబివిపి లాంటి హిందూ ఉద్యమాలు ఇక్కడ నీడ దక్కించుకునే ప్రయత్నం చేశాయి. 

భారతదేశంలో విద్యార్థి ఉద్యమాలకు సంబంధించి ఉస్మానియా తర్వాతే మిగతావన్నీ. మొన్నటి తెలంగాణా ఉద్యమానికి అంత తెగింపు నిచ్చింది కూడా ఉస్మానియాయే. ఆ తర్వాతే ఎన్జీవోలు ఆ నినాదాన్ని అందుకున్నారు. ఉస్మానియా లేని తెలంగాణా ఉద్యమాన్ని వూహించలేం. అందుకే ఉస్మానియా అంతర్జాతీయ సోషల్ సైంటిస్టుల కంటబడింది. ఉస్మానియా ఉద్యమాల మీద చాలా పరిశోధన జరిగింది. మైరాన్ వీనర్, రాబర్ట్ సి షా వంటి వాళ్లు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల ఉద్యమాల స్వరూప స్వభావాల గురించి, విద్యార్థి నాయకుల సామాజిక నేపథ్యం గురించి లోతైన విశ్లేషణ చేశారు. నాటి తెలంగాణా, రాడికల్ ఉద్యమాలు చాలా మంది నాయకులను తయారు చేసింది.

పేరున్న నాయకులను తయారు చేయలేకపోయినా,ఇటీవలి ఉద్యమం శక్తి వంతమయిన ,ఒక విధంగా ప్రభుత్వాలకు ప్రమాదకరమయిన ’ ఉస్మానియా యూనివర్శిటీ‘ అనే ఐడింటిటీని తీసుకువచ్చింది. ఇది కొనసాగితే, ఎపుడైనా, ఉస్మానియా విద్యార్థులు తిరుగుబాటు జండా ఎగరేసే ప్రమాదం ఉంటుంది. తెలంగాణా వచ్చాక, ఉద్యమాలు అవసరం లేదు, పోరగాళ్లంతా స్కూళ్లకి, కాలేజీలకు వెళ్లిపోవాలనే దోరణి ప్రభుత్వంలో కనబడుతూ ఉంది. ఉస్మానియా రాజకీయ చేవ చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా?

అవునుంటున్నాడు వనపర్తి శాసన సభ్యుడు డాక్టర్ జి. చిన్నారెడ్డి. చిన్నా రెడ్డి పెద్ద చదవుకున్నవాడు. రాజకీయాలలో మంచిపేరున్నవాడు. ముఖ్యమంత్రి కెసిఆర్ కి ఒకపుడు బాగా సన్నిహితుడు. చిన్నారెడ్డికి క్యాబినెట్ బెర్త్ ఇవ్వాలని కూడా ఆయన కృషిచేశారని చెబుతారు. కెసిఆర్ తో ఉన్న సాన్నిహిత్యం వల్లే 2004లో రాజశేఖర్ రెడ్ది చిన్నారెడ్డిని క్యాబినెట్ లోకి తీసుకోలేదని చెబుతారు. అంతెందుకు, 2005 లో కెసిఆర్ మొదటి జన్మదినం రోజున మధ్యాహ్నం సోనియా నివాసం నుంచి పిలుపొచ్చింది. కెసిఆర్ న్యూఢిల్లీలో అపుడు ఒక కొత్త హీరో. ఆరోజు జన్మదిన శుభాకాంక్షులు చెబుతూ ’రావ్ సాబ్, యువర్ లాంగ్ చెరిస్డ్ డ్రీం వుడ్ సూన్ సూన్ గెట్ రియలైజ్డ్‘ అన్నారట. ఉబ్బితబ్బిబ్బయి బంగళాకొచ్చిన కెసిఆర్ మొదటచేసిన ఫోన్ కాల్ చిన్నా రెడ్డికె నని కూడా చెబుతారు. ఇపుడు పరిస్థితులు తారుమారయ్యాయి. ఉస్మానియాలో పోరాటం ఛైతన్యం కొనసాగితే, అది టిఆర్ఎస్ పాలన మీదకు కూడా మళ్లే ప్ర మాదం ఉన్నందున ఉస్మానియా యూనివర్శటీని చంపే ప్రయత్నం జరుగుతూ ఉందని చిన్నా రెడ్డి ఆరోపిస్తున్నారు.

 ఈ రోజు ఎషియానెట్ ప్రతినిధితో మాట్లాడుతూ ఉస్మానియా వైపు విద్యార్థులు రాకుండా ఉండేందుకే ప్రమాణాలు పెంచడంలేదని అన్నారు. ‘హైదరాబాద్ లో ఇంత రాజకీయ చైతన్యం ఉన్న యూనివర్శిటీ ఇక అవసరం లేదనేది ప్రభుత్వం ఆలోచన అన్నట్లు ఉంది. లేకపోతే, రెండున్న ర సంవత్సరాలయింది, ఒక్క ప్రొఫెసర్ పోస్టు నింపలేదు. 150 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ గా ఉన్నాయి. ఫలితంగా నాక్ గుర్తింపు రాలేదు. ఫ్రొఫెసర్లే లేని విశ్వవిద్యాలయం ఏం పరిశోధన చేస్తుంది?’ అని చిన్నా రెడ్డి ప్రశ్నించారు.

రాజకీయ నాయకులు నడిపే తెలంగాణా ఉద్యమం కొడికడుతున్నపుడల్లా ప్రాణాలకు తెగించి ఉద్యమం రాజేసింది ఉస్మానియా విద్యార్థులే. మరి ఈ యూనివర్శిటీ ని వరల్డ్ క్లాస్ యూనివర్శిటీ చేసేందుకు ఈప్రభుత్వం తొలిసంతకం చేసి ఉండాల్సింది. ఏదీ? ఉద్యోగాల సంగతి కాదు, నేను మాట్లాడేది ఉద్యమాల ఉస్మానియా గురించి. ఈ రోజు ఏ పరిస్థితి ఉంది, ముఖ్యమంత్రి కెసిఆర్ గాని, విద్యాశాఖ మంత్రి గాని ఈ క్యాంపస్ లో కాలు పెట్టే స్థితిలో లేరు,’ అని చిన్నా రెడ్డి చెబుతున్నారు.

“ఇలాంటపుడు వందేళ్ల ఉస్మానియా వందేళ్ల పండగ ఎలా చేసుకుంటారు. రాష్ట్రపతిని పిలుస్తున్నారు, సబబా. వందేళ్ల ఉస్మానియాను బతుకమ్మపండగ చేసుకున్నట్లు పది పన్నెండు కోట్లు విదిలించి, ఎవ్వరినీ భాగస్వాములను చేయకుండా చేస్తారా?’ అని ఆయన అసంతృప్తి తో అన్నారు. ఉస్మానియా సంబురాలలో అన్ని పార్టీలు పాల్గొనాలి, పూర్వవిద్యార్థులను భాగస్వాములను చేయాలి. ఒక వైపు కాలేజీ లో విద్యార్థులకు మెస్ బిల్ బకాయి చెల్లించలేదు. యూనివర్శిటీ మధ్యన వెళ్లే రోడ్డు వల్ల యూనివర్శిటీ ప్రశాంతవరణం దెబ్బతింటా ఉంది, పక్క నుంచి డైవర్ట్ చేయమంటున్నారు. పట్టించుకోవడం లేదు. ఇపుడు ఉస్మానియా వందేళ్ల పండగ అంటున్నారు,” అన్నారు.

సెంటినరీ ఎప్రిల్ లో జరపాలి, రాష్ట్రపతిని ఆహ్వానించడం మినహా చేసింది ఏమీ లేదని చెబుతూ ప్రభుత్వం తన ధోరణి మార్చుకొనకపోతే, విద్యార్థులతో కలసి నిరసన కార్యక్రమం చేపడతామని చిన్నారెడ్డి హెచ్చరించారు.