ప్రతిపక్ష పార్టీల నేతలను, కార్యకర్తలను పోలీసులు వేధింపులకు గురిచేయడం చూస్తున్నాం. కానీ తాజాగా తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీ నేతపైనే పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. నేరెళ్లలో అమాయక దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన మరవకముందే ఈ ఘటన వెలుగుచూసింది. పెద్దపల్లి జిల్లా సిరిపురం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ ఉపాధ్యక్షుడు దాసరి చంద్రమోహన్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు.

బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సిరిపురం గ్రామానికి చెందిన దాసరి చంద్రమోహన్ టిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ ఉపాధ్యక్షుడు. ఆ గ్రామంలో ఆయన భూమి కూడా సుందిళ్ల ప్రాజెక్టు కింద కోల్పోయాడు. గ్రామంలో భూములు కోల్పోయే వారందరినీ చంద్రమోహనే దగ్గరుండి ఒప్పించాడు. అందరూ చంద్రమోహన్ మాట మీద భూములు ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే వారందరికీ సర్కారు 8 లక్షలు రేటు నిర్ణయించింది.

తెలంగాణ వ్యాప్తంగా నిర్వాసితుల భూములకు రేట్లు పెంచింది సర్కారు కొంచపోచమ్మ ప్రాజెక్ట నిర్వాసితులకు 13 లక్షల వరకు ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సమాచారం తెలియడంతో తమకు కూడా రేటు పెంచాలని ఆ గ్రామస్తులు దాసరి చంద్రమోహన్ పై వత్తిడి చేయడం షురూ చేశారు. దీంతో ఎమ్మెల్యేలు, అధికారుల చుట్టూ తిరిగాడు చంద్రమోహన్. కానీ దిక్కున్నచోట చెప్పుకో. భూమికి రేటు పెంచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు అధికారులు, పెద్ద నేతలు.

దీంతో అంతటా పెంచిన రేటు తమకు ఎందుకు పెంచరో తేల్చుకునేందుకు చంద్రమోహన్ తన పొలంలో పశువులను మోపేందుకు వెళ్లాడు. దీంతో పోలీసులు మాట్లాడుదామంటూ తీసుకెళ్లి చితకబాదారు. రోకలిబండలతో కొట్టి హింసించినట్లు బాధితుడు చంద్రమోహన్ మీడియాకు తెలిపారు.

అధికార పార్టీ నాయకుడిగా అందరి భూములు ఇప్పించి సర్కారు కు సాయం చేస్తే తుదకు తనపైనే దాడులు చేశారని ఆందోళన వ్యక్తం చేశాడు చంద్రమోహన్. ఇక చంద్రమోహన్ కు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ అండగా నిలిచింది. చంద్రమోహన్ పై జరిగిన దాడికి బాధ్యులైన పోలసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్.