పెద్దపల్లి జిల్లా పరిధిలోని ప్రాజెక్టుల భూ నిర్వాసితుల సమస్యలపై పెద్దపల్లి మండలం, రాఘవాపూర్ గ్రామ పరిధిలో బుధవారం పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు. గ్రామంలోని రెడ్డి పంక్షన్ హాల్ లో నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎంపి బాల్క సుమన్ కూడా హాజరు కావాల్సి ఉంది.  

ఈ సమావేశానికి మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో సమావేశానికి హాజరయ్యారని తెలుసుకున్న అధికార పార్టీ నేతలు కూడా హాజరయ్యారు. ఈ సమయంలో సమావేశంలో తమ సమస్యలు గట్టిగా వినిపించేందుకు ప్రయత్నిస్తామని కంగ్రెస్ నేతలు చెప్పారు. అయితే కాంగ్రెస్ నాయకులు సమావేశాన్ని అడ్డుకునేందుకే వచ్చారని ఆరోపిస్తూ టిఆర్ఎస్ నేతలు గొడవకు దిగారు.

దీంతో ఇరు వర్గాల మధ్య పరస్పర తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. సమావేశ మందిరంలోనే టిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కొట్టుకున్నారు. ఇద్దరి మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. బాధితుల సమస్యలు కూడా చెప్పుకోనివ్వకుండా దాడులు చేయడం టిఆర్ఎస్ పార్టీకి  తగదని శ్రీధర్ బాబు మండిపడ్డారు.

అనంతరం అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలంటూ పెద్దపల్లి పోలీసు స్టేషన్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. టిఆర్ఎస్ డౌన్ డౌన్ అంటూ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు.  ధర్నా చేస్తున్న వీడియోను కింద చూడొచ్చు.

 

 

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి