హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గులాబీ బాస్ కేసీఆర్ స్పీడ్ పెంచారు. సోమవారం తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ షురూ చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. ముందస్తు ఎన్నికల్లో అభ్యర్థులను తొలుత ప్రకటించడంతోపాటు అన్ని పార్టీల కంటే ముందుగా ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ తాజాగా మరో నిర్ణయం తీసుకోనుంది. 

పార్టీ అభ్యర్థులకు బీఫామ్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ఆయా అభ్యర్థులకు పార్టీ కార్యాలయం నుంచి ఫోన్లు కూడా చేశారు. బీఫామ్ నింపేందుకు అవసరమైన డాక్యుమెంట్లను తీసుకురావాలని సూచించారు.  

ఇకపోతే తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిన రోజే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని అభ్యర్థులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎమ్మెల్యే అభ్యర్థులు సుమారు 50 రోజులుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  

అయితే నామినేషన్ల ప్రక్రియకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ చీఫ్, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అభ్యర్థులతో భేటీ కానున్నారు. తెలంగాణ భవన్ లో 107 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో సీఎం కేసీఆర్ సమావేశమై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. 

ఇప్పటి వరకు జరిగిన ప్రచార శైలిపై అభ్యర్థులను అడిగి తెలుసుకోనున్నారు. పాక్షిక మేనిఫెస్టో పట్ల ప్రజల నుంచి ఎదురవుతున్న స్పందనపై ఆరా తీయనున్నారు. అలాగే ఎన్నికల సమయానికి సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ అనంతరం మరింత ప్రచారాన్ని వేగవంతం చేసేలా అభ్యర్థులకు క్లాస్ తీసుకోనున్నారు. 

ఇప్పటికే ప్రచారంలో జోరుమీదున్న టీఆర్ఎస్ అభ్యర్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు కేసీఆర్ పలు సూచనలు చెయ్యనున్నారు. ముఖ్యంగా అభ్యర్థులకు బీ ఫామ్స్ అందజేయనున్నారు. బీఫామ్స్ అందజేస్తున్నట్లు ఇప్పటికే అభ్యర్థులకు సమాచారం అందజేశారు. 

అలాగే ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థులు ఓటర్ జాబితాలోని పేరుతో ధృవీకరణ పత్రం తీసుకురావాలని, అలాగే అభ్యర్థుల కేసులకు సంబంధించిన వివరాల ధృవపత్రం తీసుకురావాలని కూడా కార్యాలయం నుంచి అభ్యర్థులకు ఫోన్ చేసి చెప్పారు. 

దీంతో అభ్యర్థులు ఆయా ధృవీకరణ పత్రాలతో తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. అభ్యర్థులతో సీఎం కేసీఆర్ సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ పాల్గొనబోయే బహిరంగ సభలు, నియోజకవర్గంలో ఒక్కో సభను నిర్వహించాలన్న ప్రతిపాదనలపై కూడా కేసీఆర్ అభ్యర్థులతో కలిసి నిర్ణయం తీసుకోనున్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

కార్యకర్తలతో కేసీఆర్ భేటీ, నామినేషన్ ఏర్పాట్లపై చర్చ

గజ్వేల్ అభివృద్ధి ఆగిపోవాలని హరీష్ అనుకుంటున్నాడు: కేసీఆర్