సిద్ధిపేట: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహారచనకు మరింత పదును పెట్టారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ పార్టీ బీఫామ్ లు అందజేతకు కూడా శ్రీకారం చుట్టారు. అంతేకాదు అభ్యర్థుల నామినేషన్లపై కూడా చర్చిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎర్రవల్లిలో దాదాపు 15వేల మంది కార్యకర్తలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రి హరీష్ రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ పాతూరిలతోపాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. 

గజ్వేల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధఇ, రాబోయే ఐదేళ్లలో చేపట్టబోయే పనులను కేసీఆర్ కార్యకర్తలకు వివరిస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గం పురోగతే లక్ష్యంగా తన వ్యూహాలను కార్యకర్తలకు వివరిస్తున్నారు.   

మరోవైపు సీఎం కేసీఆర్ ఈనెల 14న గజ్వేల్ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలుకు భారీ సంఖ్యలో దాదాపు లక్షమంది కార్యకర్తలు హాజరయ్యేలా ప్రణాళిక రచిస్తున్నారు సీఎం కేసీఆర్. 

ఇప్పటికే గజ్వేల్ నియోజకవర్గంలోని ఒక్కో గ్రామానికి వందమంది చొప్పున కార్యకర్తలను ఎంపిక చేసింది. అలా ఎంపిక చేసిన 15వేల మంది కార్యకర్తలతో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సమావేశమై దిశానిర్దేశం చేస్తున్నారు. 

గజ్వేల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కార్యకర్తలకు క్షుణ్ణంగా వివరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు వివరించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. అలాగే రాబోయే రోజుల్లో కేసీఆర్ చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.