సిద్ధిపేట:  తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గం అభివృద్ధి ఆగిపోవాలని హరీష్ అనుకుంటున్నారని ఛలోక్తులు విసిరారు.  ఎర్రవల్లిలో గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన సుమారు 15వేల మంది కార్యకర్తలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రి హరీష్ రావుతోపాటు ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ పాతూరి హాజరయ్యారు. 

సమావేశంలో గజ్వేల్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి చెయ్యాల్సిన అభివృద్ధిపై కేసీఆర్ కార్యకర్తలకు వివరించారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రజలతో సంబంధాలు ఆస్వాదించానని కేసీఆర్ తెలిపారు. ప్రస్తుతం నా పాత్ర మారిందని నియోజకవర్గం అభివృద్ధిలో కీలక భాగస్వామిని కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 

గజ్వేల్ లో కొంత అభివృద్ధి జరిగిందని అయితే ఇంకా జరగాల్సి ఉందని కేసీఆర్ కార్యకర్తలకు వివరించారు. గజ్వేల్ ప్రజలు చాలా గట్టివారని కితాబిచ్చారు. అభివృద్ధి విషయంలో తన నియోజకవర్గానికి పోటీ వస్తుందని ఇక్కడి అభివృద్ధి ఆగిపోవాలని హరీష్ అనుకుంటున్నాడంటూ కేసీఆర్ ఛలోక్తులు విసిరారు.

రాబోయే రోజుల్లో గజ్వేల్ లో సొంతిల్లు లేనివారుండరని కేసీఆర్ చెప్పుకొచ్చారు. 18 ఏళ్లు నిండిన ప్రతీ వ్యక్తికి సొంతిల్లు ఉండేలా చర్యలు తీసుకుంటానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రతీ ఇంటికి తాగునీరు, ప్రతి గంటకు సాగునీరు అందిస్తానని భరోసా ఇచ్చారు. కొండపోచమ్మ సాగర్ ను వచ్చే వర్షాకాలంలో నింపుతామని తెలిపారు. గజ్వేల్ ప్రజలను ఏడాదికి మూడు పంటలు పండించుకునే స్థాయికి తీసుకురావాలన్నదే తన లక్ష్యమన్నారు.

మరోవైపు అభివృద్ధిలో గజ్వేల్ నియోజకవర్గం 20 ఏళ్లు ముందుకెళ్లిందని టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు తెలిపారు. భారీ మెజారిటీతో కేసీఆర్ గెలవబోతున్నారని హరీష్ జోస్యం చెప్పారు. కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచించారు.

ఈ వార్తలు కూడా చదవండి

కార్యకర్తలతో కేసీఆర్ భేటీ, నామినేషన్ ఏర్పాట్లపై చర్చ