జీహెచ్‌ఎంసీ మేయర్ అభ్యర్థిపై టీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాం అనుసరిస్తుందోనని గత కొంతకాలంగా నెలకొన్న సస్పెన్స్‌కు గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ తెరదించారు.

తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన.. మేయర్ అభ్యర్థి పేరును షీల్డ్ కవర్‌లో పంపిస్తామని తెలిపారు. ఈ నెల 11న ఉదయం కార్పొరేటర్లు తెలంగాణ భవన్‌కు రావాలని కేసీఆర్ ఆదేశించారు.

అలాగే ఈ నెల 12 నుంచి టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని,  నియోజకవర్గానికి 50 వేలకు తగ్గకుండా 80 లక్షల సభ్యత్వాలు చేయాలని నేతలకు సీఎం సూచించారు.

మార్చి 1 నుంచి పార్టీ కమిటీల నియామకం జరుగుతుందని.. కమిటీల ఏర్పాటుకు జిల్లాల వారిగా ఇంఛార్జీలను ప్రకటించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మాటలు అందరూ గౌరవించాలని శ్రేణులకు సూచించారు.

Also Read:నేనే సీఎంగా ఉంటా: తేల్చేసిన కేసీఆర్

మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ లు కలిసి పనిచేయాలని, నియోజకవర్గాల వారిగా ఆత్మీయ భోజనాలు పెట్టుకుని ఐక్యంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్‌లో టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు. 

అంతకుముందు ముఖ్యమంత్రి మార్పుపైనా కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా వున్నానని.. మరో పదేళ్ల పాటు తానే సీఎంగా వుంటానని ఆయన స్పష్టం చేశారు. ఇకపై సీఎం మార్పు గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని టీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.