హైదరాబాద్:నాగార్జునసాగర్ అసెంబ్లీ స్తానానికి జరిగే ఉప ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీలు ఇంకా అభ్యర్ధులను ప్రకటించలేదు.ఈ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా జానారెడ్డి  విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య అనారోగ్యంతో మరణించాడు.దీంతో  ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.2018 లో ఈ స్థానం నుండి నోముల నర్సింహ్మయ్య టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లో ఇదే స్థానం నుండి పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యాడు.

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుండి జానారెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. ఇప్పటికే జానారెడ్డి ఈ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ నియోజకవర్గంలో విజయం సాధించాలని టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

నోముల నర్సింహ్మయ్య కొడుకు భగత్ ఈ స్థానం నుండి పోటీకి ఆసక్తిగా ఉన్నారు. కానీ టీఆర్ఎస్ నాయకత్వం మాత్రం ఆయనకు సీటు ఇచ్చే విషయమై స్పష్టత ఇవ్వలేదు.ఈ నియోజకవర్గంలోని యాదవ సామాజికవర్గానికి చెందిన నేతకు సీటు ఇవ్వాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. నియోజకవర్గంలోని ముగ్గురు కీలక నేతలకు కేసీఆర్ ఇటీవల ఫోన్ చేశారు. యాదవ సామాజికవర్గం నేతల్లో ఒకరికి సీటు ఇచ్చే అవకాశం ఉంది. 

గత ఎన్నికల్లో పోటీ చేసిన నివేదిత రెడ్డి మరోసారి బరిలోకి దిగేందుకు ఆసక్తిగా ఉన్నారు. టీడీపీ నుండి బీజేపీలో చేరిన కడారి అంజయ్య యాదవ్ కూడ ఈ స్థానంలో సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.టీఆర్ఎస్ అభ్యర్ధిని ప్రకటించిన తర్వాత  అభ్యర్ధిని ప్రకటించాలని బీజేపీ ప్లాన్ చేసింది. టీఆర్ఎస్ లో టిక్కెట్టు దక్కనివారిని తమ పార్టీలో చేర్చుకొనే వ్యూహాన్ని కూడ బీజేపీ అమలు చేసే అవకాశం లేకపోలేదు.