తెలంగాణ హైకోర్టు నుంచి నలుగురు న్యాయమూర్తులను బదిలీ చేయాలని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఇద్దరు జడ్జీలనూ ట్రాన్స్‌ఫర్ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులు కూడా చేసింది. 

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు నుంచి నలుగురు జడ్జీలు బదిలీ కానున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అలాగే.. ఏపీ హైకోర్టు నుంచి కూడా ఇద్దరు న్యాయమూర్తులను బదిలీ చేయాలని అందులో పేర్కొంది.

తెలంగాణ హైకోర్టులో విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ జీ అనుపమా చక్రవర్తిని పట్నా హైకోర్టుకు, జస్టిస్ మున్నూరి లక్ష్మణ్‌ను రాజస్తాన్ హైకోర్టుకు, జస్టిస్ ఎం సుధీర్ కుమార్‌ను మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ సీ సుమలతను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులు చేసింది.

Also Read: ఆ కేసులో కోర్టుకు బర్రెను కూడా తీసుకువచ్చారు.. ఎందుకో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఇద్దరు న్యాయమూర్తులు బదిలీ చేయాలని కొలీజియం నిర్ణయం తీసుకుంది. జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్‌ను గుజరాత్ హైకోర్టుకు, జస్టిస్ దుప్పల వెంకటరమణను మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసులు చేసింది. అయితే, తనను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, కర్ణాటకకు బదిలీ చేయాలని జస్టిస్ దుప్పల వెంకటరమణలు కొలీజియంను కోరారు. కాని, వారి విజ్ఞప్తిలో తమ నిర్ణయాన్ని ప్రభావితం చేసేంత అంశాలేమీ లేకపోవడంతో తమ నిర్ణయాన్నే సిఫారసులకు పంపించామని కొలీజియం వివరించింది.