ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం రిస్క్: హైద్రాబాద్‌లో రైలు ఢీకొని సర్ఫరాజ్ మృతి
హైద్రాబాద్ సనత్ నగర్ రైల్వే ట్రాక్ పై ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కోసం వీడియో రికార్డు చేస్తున్న సమయంలో రైలు ఢీకొని సర్ఫరాజ్ ఖాన్ మృతి చెందాడు.
హైదరాబాద్: నగరంలోని సనత్ నగర్ రైల్వే ట్రాక్ పై రీల్స్ కోసం వీడియో షూట్ చేస్తూ సర్ఫరాజ్ అనే విద్యార్ధి మృతి చెందాడు.హైద్రాబాద్ రహమత్ నగర్ లోని మదర్సాలో సర్పరాజ్ అనే విద్యార్ధి చదువుకుంటున్నారు. తన ఇద్దరు మిత్రులతో కలిసి ఇన్ స్టా రీల్స్ కోసం వీడియో షూట్ చేయడం కోసం సర్ఫరాజ్ ఇవాళ సనత్ నగర్ రైట్వే ట్రాక్ వద్దకు చేరుకున్నాడు.
ఇవాళ మధ్యాహ్నం నుండి సర్పరాజ్ రీల్స్ కోసం వీడియోలు షూట్ చేశాడు. కానీ వారు అనుకున్నట్టుగా వీడియోలు రాలేదు. అయితే రైల్వే ట్రాక్ కు అతి సమీపంలో నిలబడి సర్ఫరాజ్ రీల్స్ కోసం నిలబడి ఉన్న సమయంలో రైలు సర్షరాజ్ ను డీకొట్టింది. దీంతో తలకు బలమైన గాయమైన సర్ఫరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. రైలు వస్తున్న విషయాన్ని సర్ఫరాజ్ కు తెలిపారు మిత్రులు రైల్వే ట్రాక్ నుండి పక్కకు జరగాలని సూచించారు. కానీ అతను తప్పుకోలేదు. రైల్ ఢీకొని సర్ఫరాజ్ మృతి చెందాడు. సర్ఫరాజ్ తో పాటు వచ్చిన ఇద్దరు మిత్రుల నుండి ఈ విషయమై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.