సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారుల దాడిలో రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లిందని డీఆర్ఎం తెలిపారు. సిగ్నల్ వ్యవస్థ, పార్శిల్ ఆఫీసు, ఐదు రైలు ఇంజిన్లను నిరసనకారులు ధ్వంసం చేశారని ఆయన వెల్లడించారు. 

త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని (agnipath) వ్యతిరేకిస్తూ శుక్రవారం ఆందోళనకారులు చేపట్టిన నిరసన సికింద్రాబాద్‌లో (secunderabad railway station) ఉద్రిక్తలకు దారి తీసిన సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్‌లో జనజీవనానికి ఇబ్బంది కలిగింది. హింసాత్మక పరిస్ధితులు, ఆందోళనకారులు దాడులు చేస్తారన్న భయంతో సాధారణ రైళ్లు, ఎంఎంటీఎస్‌తో (mmts) పాటు హైదరాబాద్ మెట్రో సర్వీసులను (hyderabad metro) అధికారులు రద్దు చేశారు. అయితే ప్రస్తుతం నిరసనకారులు శాంతించడం, పరిస్ధితి అదుపులో వుండటంతో సికింద్రాబాద్ నుంచి రైళ్ల రాకపోకలను రైల్వే శాఖ పునరుద్ధరించింది. దీనిలో భాగంగా లింగంపల్లి నుంచి కాకినాడకు వెళ్లాల్సిన ఎక్స్‌ప్రెస్ రాత్రి 7.40కి బయల్దేరనుంది. విశాఖ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రాత్రి 8.20కి బయల్దేరనుంది. 

ఈ సందర్భంగా సికింద్రాబాద్ డీఆర్ఎం మీడియాతో మాట్లాడుతూ.. రైల్వే పార్శిల్ ఆఫీస్ పూర్తిగా ధ్వంసమైందని చెప్పారు. పార్శిల్ ఆఫీసులో వున్న వస్తువులు ధ్వంసమయ్యాయని.. ఇప్పటి వరకు రూ.7 కోట్ల వరకు ఆస్తి నష్టమైందని డీఆర్ఎం తెలిపారు. పార్శిల్ కార్యాలయంలో వున్న వాహనాలు ధ్వంసమయ్యాయని.. చాలా వరకు ఇన్సూరెన్స్ వుందని, పరిశీలిస్తున్నామని డీఆర్ఎం పేర్కొన్నారు. పలు బోగీలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయని ఆయన చెప్పారు. చాలా బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయని.. ఐదు రైల్వే ఇంజిన్లను పూర్తిగా ధ్వంసం చేశారని డీఆర్ఎం వెల్లడించారు. సిగ్నల్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని.. దీనిని తాత్కాలికంగా రిపేర్ చేశామని ఆయన పేర్కొన్నారు. 

మరోవైపు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు పోలీసులు ఆపరేషన్ మొదలుపెట్టారు. దీనిలో భాగంగా పట్టాలపై కూర్చొని ఆందోళన చేస్తున్న వారిని తరిమేస్తున్నారు. ఫ్లాట్ ఫాం 1,2,3లను ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసుల యాక్షన్‌తో బయటకు పరుగులు తీస్తున్నారు అభ్యర్ధులు. అటు రైల్వే డీజీ సందీప్ శాండిల్య స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన ఆధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో రైల్వే ట్రాక్ మొత్తాన్ని క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రైల్వే స్టేషన్ మొత్తం తమ ఆధీనంలో వుందని అడిషనల్ కమీషనర్ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ఆందోళన చేస్తున్న వారందరినీ బయటకు పంపివేశామని ఆయన పేర్కొన్నారు. పట్టాలపై వున్న వారందరీని క్లియర్ చేశామని శ్రీనివాస్ వెల్లడించారు. 

ఇకపోతే.. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలతో శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. రైల్వే స్టేషన్లోకి చొచ్చుకొచ్చిన వేలాది మంది ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులు అక్కడ నిలిపి వుంచిన రైళ్లకు నిప్పుపెట్టి ఆస్తులను ధ్వంసం చేశారు. ఉదయం 8.30 గంటలకు మొదలైన ఆందోళన మధ్యాహ్నం కావొస్తున్నా ఇంకా కొనసాగుతోంది. తొలుత మొదట మూడు, నాలుగు వందల మంది విద్యార్థులు స్టేషన్ లోకి చొచ్చుకొచ్చారు. ఆ తర్వాత మరింత మంది ఆందోళనకారులు రావడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. ఇంతమంది ఒక్కసారిగా స్టేషన్‌లోకి దూసుకు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. తమ వస్తువులను రైళ్లలోనే వదిలిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రజలు బయటకు పరుగులు తీశారు.

ఆందోళనకారులను అదుపు చేసేందుకు ఆర్పీఎఫ్‌తో పాటు రాష్ట్ర పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దాంతో, అదనపు బలగాలను స్టేషన్లో మోహరించారు. పట్టాలపైకి వచ్చిన ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో తర్వాత గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయాలైనట్టు సమాచారం. అటు పోలీసు కాల్పుల్లో గాయాల పాలైన 13 మంది బాధితులకు గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మహేశ్, మోహన్, కుమార్, శ్రీకాంత్‌, రంగస్వామి, రాకేశ్, పరశురామ్, నాగేందర్, వినయ్‌లకు బుల్లెట్ గాయాలు అయ్యాయి.