హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ లో రేపటినుంచి మూడు నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో రేపటి నుంచి మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఈనెల 13 నుంచి ఆగస్టు 10 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
హైదరాబాదులోని ఐటీ కారిడార్ లో మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. శిల్పా లేఅవుట్ ఫేజ్-2 ఫ్లైఓవర్ పనుల కోసం గచ్చిబౌలి జంక్షన్ నుంచి కొండాపూర్ వరకు పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నట్లుగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
మే 13వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ఈ మళ్లింపులు ఉంటాయని, వాహనదారులు గుర్తించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ను కూడా పోలీసులు విడుదల చేశారు.
ఔటర్ రింగ్ రోడ్డు నుంచి హఫీజ్ పేట్ కు వెళ్లాల్సిన వాహనదారులు.. శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ - మీనాక్షి టవర్స్ - డెలాయిట్ – ఏఐజి హాస్పిటల్ - క్యూమార్ట్ - కొత్తగూడ ఫ్లైఓవర్ ద్వారా హఫీజ్ పేట్ కు వెళ్లాల్సి ఉంటుంది.
లింగంపల్లి నుంచి కొండాపూర్ వెళ్లాల్సిన వాళ్లు.. గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ - డిఎల్ఎఫ్ రోడ్- రాడిసన్ హోటల్ - కొత్తగూడా మీదుగా కొండాపూర్ చేరుకోవాల్సి ఉంటుంది.
విప్రో జంక్షన్ నుంచి ఆల్విన్ క్రాస్ రోడ్స్ వెళ్లే వాహనాలు.. ట్రిపుల్ ఐటి జంక్షన్ - లెఫ్ట్ టర్న్ - గచ్చిబౌలి స్టేడియం దగ్గర యూటర్న్ - డిఎల్ఎఫ్ రోడ్ - ర్యాడిసన్ హోటల్ - కొత్తగూడ ఫ్లైఓవర్ నుంచి ఆల్విన్ వైపుకు వెళ్లడానికి అనుమతించారు.
టోలిచౌకి నుంచి ఆల్విన్ క్రాస్ రోడ్స్ వెళ్లే వాహనదారులు. గచ్చిబౌలి అండర్ ఫ్లైఓవర్ వద్ద యూటర్న్ తీసుకోవాలి. అక్కడి నుంచి శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ బస్టాప్ పక్క నుంచి - మీనాక్షి టవర్స్ - డెలాయిట్ - ఏఐజీ ఆస్పత్రి - క్యూ మార్ట్ - కొత్తగూడా మీదుగా కొండాపూర్ చేరుకోవాలి.
సొంత వాహనాల్లో వెళ్లే వారే కాదు బస్సులు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లోనే ప్రయాణిస్తాయని పోలీసులు తెలిపారు.
ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ మల్లింపుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల్లోనే ఆర్టీసీ బస్సులు కూడా రాకపోకలు సాగిస్తాయని టిఎస్ఆర్టిసి సికింద్రాబాద్ రీజియన్ రీజినల్ మేనేజర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. లింగంపల్లి నుంచి మెహిదీపట్నం వెళ్లే 216కే బస్సు రాడిసన్ హోటల్ ఎక్స్ రోడ్ నుంచి మీనాక్షి టవర్, ఐకియా, బయోడైవర్సిటీ ఎక్స్ రోడ్ మీదుగా వెళుతుందని చెప్పారు.
మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మంచిరేవులకు వెళ్లే 221 బస్సు రాడిసన్ హోటల్ నుంచి డిఎల్ఎఫ్, ఐఐటి ఎక్స్ రోడ్ నుంచి గచ్చిబౌలి మీదుగా వెడుతుందని తెలిపారు. ఇక సికింద్రాబాద్ నుంచి వేవ్ రాక్ కు వెళ్లే 10హెచ్డబ్ల్యూ బస్సు డిఎల్ఎఫ్, ఐఐటి ఎక్స్ రోడ్, విప్రో సర్కిల్ మీదుగా రాకపోకలు సాగించనున్నాయని తెలిపారు.
