తీసుకున్న అప్పు ఎన్ని రోజులు గడిచినా.. తిరిగి ఇవ్వడంలేదని ఓ వడ్డీ వ్యాపారి.. అప్పు తీసుకున్న వ్యక్తి భార్య, బిడ్డలను లాక్కొని వెళ్లాడు. ఈ సంఘటన మంచిర్యాల పట్టణం నెన్నెల మండలం ఆవడం గ్రామంలో చోటుచేసుకుంది.

తన భార్య, బిడ్డలను వడ్డీ వ్యాపారి తన వెంట లాక్కొని వెళ్లాడంటూ బాసవేన హనుమంతు  అనే వ్యక్తి సోమవారం ప్రజావాణిలో జిల్లా సంయుక్త పాలనాధికారి సురేందర్‌రావుకు ఫిర్యాదు చేశారు. తన భార్య పిల్లలను తనకు అప్పగించాలని కోరారు. 

బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..తాను ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నానని, తనకు మహారాష్ట్రకు చెందిన అమ్మాయితో 2010లో వివాహం అయిందన్నారు. తమకు ఒక పాప, ఒక బాబు పుట్టారని తెలిపారు. తనకు ఆరోగ్యం బాగాలేక రెండేళ్ల కిందట చిత్తపూర్‌కు చెందిన సంధాని అనే వ్యక్తి వద్ద రూ.20 వేలు అప్పు తీసుకున్నామని తెలిపారు. 

ఈ డబ్బుల కోసం తరచూ తన ఇంటికి వస్తూ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఈ విషయం తెలిసి భార్యపిల్లలను తీసుకుని రెండు నెలల కిందట మందమర్రిలో అద్దెకు ఇల్లు తీసుకుని ఉంటున్నానని తెలిపారు. నెల రోజుల కిందట తాను ఆవడంలో పని చేయడానికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి తన భార్యపిల్లలు లేరని చెప్పారు. 

వారికోసం తిరుగుతుండగా వారంరోజుల కిందట తనకు అప్పు ఇచ్చిన సంధాని వాళ్లను తీసుకెళ్లి మంద్రమర్రిలోని దీపక్‌నగర్‌లో ఉంచినట్టు తెలిసిందన్నారు. అప్పు రూ.20 వేలు వడ్డీతో తిరిగి ఇస్తేనే నీ భార్య పిల్లలను పంపిస్తానని బెదిరించారని కంటతడి పెట్టారు. ఎలాగైనా తన భార్యపిల్లలను అప్పగించాలని కోరారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నన్నెల మండల పోలీసులు తెలిపారు.