Asianet News TeluguAsianet News Telugu

మంత్రులతో హెచ్‌సీఏ కుమ్మక్కు... 32 వేల టికెట్లు అమ్మాలి, ఎన్ని అమ్ముడయ్యాయి: అజారుద్దీన్‌పై మహేశ్ గౌడ్ ఆరోపణలు

ఇండియా - ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల వ్యవహారానికి సంబంధించి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మహేశ్ గౌడ్.. మరో వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన అజార్‌పై విమర్శలు చేయడం కలకలం రేపుతోంది. కొందరు మంత్రులు హెచ్‌సీఏతో కుమ్మక్కయ్యారని మహేశ్ గౌడ్ ఆరోపించారు. 

tpcc working president mahesh goud sensational comments on hca president mohammed azaharuddin due to india australia match tickets issue
Author
First Published Sep 24, 2022, 3:18 PM IST

ఈ నెల 25న జరగనున్న ఇండియా - ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల వ్యవహారం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసిందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్. నిర్వహణలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ , ప్రభుత్వం విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు. కొందరు మంత్రులు హెచ్‌సీఏతో కుమ్మక్కయ్యారని.. 32 వేల టికెట్లను మార్కెట్‌లో పెట్టాలని, అసలు ఎన్ని టికెట్లు పెట్టారన్నది క్లారిటీ ఇవ్వాలని మహేశ్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై అసలు అజారుద్దీన్‌కు కూడా క్లారిటీ లేదని.. ఏం చెబుతున్నారో అర్ధం కావడం లేదని చురకలు వేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని మహేశ్ గౌడ్ డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మహేశ్ గౌడ్ మరో వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన అజార్‌పై విమర్శలు చేయడం కలకలం రేపుతోంది. 

ALso REad:జింఖానా గ్రౌండ్స్ తొక్కిసలాటలో నా తప్పుంటే అరెస్టు చేయండి: హెచ్ సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్

ఇకపోతే.. టికెట్ల పంపిణీ తమ చేతుల్లో లేదు అని చెప్పిన హెచ్‌సీఏ దొడ్డిదారిన పంపకాలు చేస్తోంది. టికెట్ల అమ్మకాలు మొత్తం పేటీఎంకి అప్పగించామని చెబుతూ.. తమ దగ్గర వేల సంఖ్యలో టికెట్లు పెట్టుకుంది. హెచ్‌సీఏ సిబ్బంది ఏకంగా స్టేడియంలోనే టికెట్ల పంపిణీ మొదలుపెట్టారు. తమ అనుచరులుకు ఇష్టానురీతిలో టికెట్లను ఇచ్చుకున్నారు. మూడు సూడు కేసుల్లో టికెట్లు తీసుకొచ్చి.. స్టేడియం లోపల సీక్రెట్‌గా పంపకాలు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించి ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది.

ALso REad:హెచ్‌సీఏ దగ్గరే వేల టికెట్లు.. ఉప్పల్ స్టేడియంలో సీక్రెట్‌గా పంపకాలు, అజార్ మాటలపై అనుమానాలు

ఆ వార్తాకథనం ప్రకారం.... హెచ్‌సీఏ ఆధ్వర్యంలో వున్న క్రికెట్ క్లబ్‌లు, వీఐపీలకు ఇక్కడి నుంచే పంపిణీ చేశారు. మరోవైపు టికెట్లు పంపిణీ చేస్తున్నారని సమాచారం అందుకున్న అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. అయితే ఇవి కాంప్లిమెంటరీ టికెట్లా లేక అసలైనవా అన్నది తెలియాల్సి వుంది. ప్రెస్‌మీట్‌లో అజారుద్దీన్ చెప్పిన టికెట్ల లెక్కకు, పంపిణీ చేస్తోన్న టికెట్ల మధ్య కొంత తేడా వున్నట్లుగా తెలుస్తోంది. 

అంతకుముందు టికెట్ల విక్రయం, జింఖానా గ్రౌండ్‌లో తొక్కిసలాటకు సంబంధించి హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. టికెట్ల విక్రయానికి సంబంధించి ఎలాంటి పొరపాట్లు జరగలేదన్నారు. బ్లాక్ టికెట్లు అమ్మినట్లు తేలితే తనను అరెస్ట్ చేసుకోవచ్చని అజారుద్దీన్ వ్యాఖ్యానించారు. బ్లాక్ టికెట్లు ఎవరు అమ్మినా చర్యలు తీసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. నిన్నటి ఘటనలో తీవ్రంగా గాయపడిన వారందరికీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరపున వైద్య చికిత్సను భరిస్తామని అజారుద్దీన్ వెల్లడించారు. 

మ్యాచ్‌కు సంబంధించి టికెట్లను బ్లాక్ చేయలేదని హెచ్ సీ ఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ తెలిపారు. ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. చాలా ఏళ్ల తర్వాత హైద్రాబాద్ లో మ్యాచ్ నిర్వహణకు అవకాశం వచ్చిందన్నారు. పేటీఎం ద్వారా ఆన్ లైన్ లో టికెట్లు విక్రయించినట్టుగా అజహరుద్దీన్ తెలిపారు.   ఈ మ్యాచ్ ను విజయవంతం  చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios