జింఖానా గ్రౌండ్స్ తొక్కిసలాటలో నా తప్పుంటే అరెస్టు చేయండి: హెచ్ సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్

ఈ నెల 25వ తేదీన ఉప్పల్ లో జరిగే ఇండియా, అస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా హెచ్ సీ ఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ తెలిపారు. ఈ మ్యాచ్ కు సంబంధించి టికెట్లను తాము బ్లాక్ చేయలేదన్నారు. 

No Confusion In Ticket Sales : HCA president Mohammad Azharuddin

హైదరాబాద్:  జింఖానా గ్రౌండ్స్ లో నిన్న జరిగిన  తొక్కిసలాటలో తన తప్పుంటే అరెస్ట్ చేసుకోవచ్చని హెచ్ సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ చెప్పారు. శుక్రవారం నాడు అజహరుద్దీన్  హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.జింఖానా గ్రౌండ్ వద్ద తొక్కిసలాటలో  తమ తప్పు లేదన్నారు. . తాను తప్పు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తాను ఏం తప్పు చేశానో చెప్పాలని అజహరుద్దీన్ ప్రశ్నించారు. నిన్న జరిగిన తొక్కిసలాట  దురదృష్టకరంగా పేర్కొన్నారు.

also read:జింఖానా గ్రౌండ్స్‌లో తొక్కిసలాట .. అజారుద్దీన్‌ను తప్పించండి: హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు

జింఖానా గ్రౌండ్ వద్ద ఏం జరిగిందో పోలీసులకు తెలుసునని అజహరుద్దీన్ తెలిపారు. జింఖానా గ్రౌండ్ వద్ద తొక్కిసలాట జరగకుండా పోలీసులు చూసుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.  గతంలో ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అలానే టికెట్ల విక్రయం జరుగుతుందని అజహరుద్దీన్ వివరించారు.  ఈ మ్యాచ్ కు సంబంధించి ఎలాంటి కాంప్లిమెంటరీ పాసులు లేవని ఆయన స్పష్టం చేశారు. 

టికెట్ల విక్రయానికి సంబంధించి తాము ముందే  సంబంధిత అధికారులకు లేఖ రాసినట్టుగా అజహరుద్దీన్ తెలిపారు. నిన్న తొక్కిసలాటలో గాయపడిన వారికి చికిత్సకు సంబంధించి ఖర్చులను భరిస్తామన్నారు. ప్రతీదీ తాము పారదర్శకంగా  చేస్తున్నామని అజహరుద్దీన్  వివరణ ఇచ్చారు.అన్ని సజావుగా నిర్వహిస్తున్నామన్నారు. ఇంత కంటే ఏం చేయగలనో చెప్పాలని అజహరుద్దీన్ అడిగారు. 

టికెట్ల విక్రయం గురించి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని అజహరుద్దీన్ చెప్పారు  టికెట్లు బ్లాక్ అమ్మితే పోలీసులు చర్యలు తీసుకొంటారన్నారు. టికెట్ల విక్రయంలో ఎలాంటి గందరగోళం లేదని ఆయన స్పష్టం చేశారు. 

ఈ నెల 25వ తేదీన ఉప్పల్ స్టేడియంలో జరిగే ఇండియా, అస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ కు సంబంధించి  టికెట్లను బ్లాక్ చేయలేదని హెచ్ సీ ఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ తెలిపారు. ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. చాలా ఏళ్ల తర్వాత హైద్రాబాద్ లో మ్యాచ్ నిర్వహణకు అవకాశం వచ్చిందన్నారు. పేటీఎం ద్వారా ఆన్ లైన్ లో టికెట్లు విక్రయించినట్టుగా అజహరుద్దీన్ తెలిపారు.   

 ఈ మ్యాచ్ ను విజయవంతం  చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకంపై పేటీఎంకు కాంట్రాక్టు ఇచ్చినట్టుగా ఆయన చెప్పారు. ఈ నెల 15న ఆన్ లైన్ లో 11,450 టికెట్లు విక్రయించినట్టుగా ఆయన చెప్పారు.  కార్పోరేట్ బుకింగ్  పేటీఎం ద్వారా 4 వేలు బుక్కయ్యాయని అజహరుద్దీన్ తెలిపారు. నిన్న మూడువేల టికెట్లు విక్రయించామన్నారు. డైరెక్ట్ స్పాన్సర్స్ కు 6 వేల టికెట్లు కేటాయించినట్టుగా తెలిపారు.  

టికెట్ల విక్రయం పేటీఎంకు కాంట్రాక్టు ఇచ్చినందున ఈ విషయమై తమకు సంబంధం లేదని హెచ్ సీ ఏ సెక్రటరీ విజయానంద్ చెప్పారు. పేటీఎం చేస్తున్న దానికి తమకు సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. హెచ్ సీ ఏలో విబేధాలున్నమాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ఒక్క కుటుంబంలో అన్నదమ్ముల మధ్య కూడా విబేధాలుంటాయన్నారు.అయితే ఈ విషయమై ఏం మాట్లాడినా  ఇబ్బందులు వస్తాయని ఆయన చెప్పారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios