పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల చేసిన ఒక స్టేట్ మెంట్ బూమరాంగ్ అయినట్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పుమంటున్నాయి. ఎక్కడైనా అధికార పార్టీ నేతలు ఇచ్చే స్టేట్ మెంట్ లు కొన్నిసార్లు బూమరాంగ్ అవుతుంటాయి. కానీ తెలంగాణలో మాత్రం ప్రతిపక్ష నేత ఇచ్చిన ప్రకటన బూమరాంగ్ కావడం ఆశ్చర్యంగా ఉందని రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు. ఇంతకూ ఉత్తమ్ ఏమన్నారు? ఆయన స్టేట్ మెంట్ ఎందుకు వివాదంలోకి నెట్టబడిందో ఈ స్టోరీ చదవండి.

నిరుద్యోగులు, విద్యార్థుల విషయంలో తెలంగాణ సర్కారు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ విషయంలో ఉద్యోగాల విషయంలో సర్కారు వైఖరిపై యూత్ గుర్రుగా ఉన్నారన్న భావనకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ వారిని ఎలాగైనా తమవైపు తిప్పుకోవాలన్న ఉద్దేశంతో వ్యూహరచన చేస్తోంది. అందులో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన చేశారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు 3వేల నిరుద్యోగ భృతి అందిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన పట్ల నిరుద్యోగుల్లో భారీగా పాజిటీవ్ స్పందన వస్తుందనుకున్నారేమో కానీ.. యూత్ లో ఆశించిన స్పందన రాలేదు. పైపెచ్చు.. కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు దుమ్ము రేపుతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తాం.. అన్నట్లు ప్రకటనలు చేయాల్సిందిపోయి.. 25 ఏళ్లకే పెన్షన్ లాంటి నిరుద్యోగ భృతి ఇస్తమని ప్రకటనలు ఇస్తారా అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సర్కారు ఉద్యోగాలు ఇవ్వకపోతే గట్టిగా పోరాడాల్సిందిపోయి నిరుద్యోగ భృతి ప్రకటనలు చేయడం బాధాకరమంటున్నారు.

మొత్తానికి ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ చేసిన ప్రయత్నం నిరుద్యోగ వర్గాలను ఆకట్టుకోలేకపోయిందని పార్టీ నేతలు సైతం చర్చించుకుంటున్నారు.