Asianet News TeluguAsianet News Telugu

టీపీసీసీ కమిటీలు.. టీడీపీ నుంచి వచ్చినవాళ్లు వీరే : కాంగ్రెస్ సీనియర్లకు మల్లు రవి కౌంటర్

టీపీసీసీ కమిటీల్లో టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత కల్పించారంటూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మల్లు రవి. డీసీసీ అధ్యక్షుల్లో ఒక్కరు కూడా టీడీపీ నుంచి వచ్చినవాళ్లు లేరని ఆయన స్పష్టం చేశారు. 
 

tpcc leader mallu ravi counter to telangana congress seniors
Author
First Published Dec 17, 2022, 6:35 PM IST

ఇటీవల ప్రకటించిన టీపీసీసీ కమిటీలపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి తన వర్గీయులకే పదవులు కట్టబెట్టారంటూ వారు విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా సీఎల్పీ నేత భట్టి ఇంట్లో సమావేశమై రేవంత్ పెట్టే సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ల విమర్శలకు కాంగ్రెస్ నేత మల్లు రవి కౌంటరిచ్చారు. 22 మంది పీఏసీ కమీటీలో రేవంత్ రెడ్డి తప్పించి.. టీడీపీ నుంచి వచ్చినవాళ్లు లేరని ఆయన అన్నారు. 

40 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఇద్దరే టీడీపీ నుంచి వచ్చినవాళ్లు వున్నారని మల్లు రవి క్లారిటీ ఇచ్చారు. ఉపాధ్యక్ష పదవిలో 24 మందిలో ఐదుగురు టీడీపీ నుంచి వచ్చినవాళ్లే వున్నారని మల్లు రవి పేర్కొన్నారు. 84 మంది ప్రధాన కార్యదర్శుల్లో ఐదుగురు టీడీపీ నుంచి వచ్చినవాళ్లేనని ఆయన చెప్పారు. డీసీసీ అధ్యక్షుల్లో ఒక్కరు కూడా టీడీపీ నుంచి వచ్చినవాళ్లు లేరని మల్లు రవి స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు కమిటీలో 68 శాతం.. ఓసీలకు 32 శాతం అవకాశం కల్పించామని ఆయన పేర్కొన్నారు. 

కాగా... సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన సీనియర్ నేతల సమావేశంలో ఉత్తమ్ కుమార్, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, మధుయాష్కి‌లతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం నాయకులు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా ఆయనపై కామెంట్స్ చేశారు. ఒర్జినల్‌ కాంగ్రెస్‌ నినాదంతో.. వలస వచ్చిన నేతల వల్ల పార్టీ నమ్ముకున్న వాళ్లకు తీవ్ర నష్టం జరుగుతుందని ఉమ్మడి గళం వినిపించారు. 

ALso REad:టీ. కాంగ్రెస్‌లో ముసలం .. రేవంత్‌పై సీనియర్ల తిరుగుబాటు, ఏ సమావేశం పెట్టినా బహిష్కరణే

టీపీసీసీ కమిటీల్లో బయటి నుంచి వచ్చినవారికే.. ముఖ్యంగా టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకే ఎక్కువ పదవులు దక్కాయని చెప్పారు. రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించనప్పటికీ.. వలస నాయకుడు, నాలుగు పార్టీలు మారిన వ్యక్తి  తెలంగాణలో కాంగ్రెస్‌ను ఉద్దరిస్తారా? అంటూ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీని హస్తగతం చేసుకోవడానికో, ఇంకొకరికి అప్పజెప్పాలనో కుట్ర జరుగుతుందని కూడా ఆరోపించారు. 

సోషల్ మీడియా పోస్టులతో కాంగ్రెస్‌లో మొదటి నుంచి ఉన్న నాయకులపై కోవర్టులుగా ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత అనుకూల మీడియా ద్వారా విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము కాంగ్రెస్‌లోనే పుట్టామని, కాంగ్రెస్‌లోనే ఉన్నామని, కాంగ్రెస్‌లోనే చస్తామని నేతలు స్పష్టం చేశారు. అసలైన కాంగ్రెస్‌వాదులకు న్యాయం జరగాలన్నదే తమ లక్ష్యమని.. అందుకే సేవ్ కాంగ్రెస్ కార్యక్రమంతో ముందుకు వెళ్లనున్నట్టుగా ప్రకటించారు.  

రేపు పీసీసీ సమావేశం పెట్టినా బహిష్కరించాలని సీనియర్లు నిర్ణయించారు. రేపటి పీసీసీ సమావేశంలో ఏఐసీసీ కార్యక్రమాలపై చర్చించాలని పీసీసీ కార్యవర్గం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు.. వచ్చే మంగళవారం మరోసారి కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ కావాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి మరికొందరినీ పిలవాలని నేతలు నిర్ణయించారు. మరోవైపు టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌ మాణిక్కం ఠాగూర్ వైఖరిపై కూడా ఈ సమావేశంలో చర్చించాలని భావిస్తున్నట్టుగా సమాచారం. మంగళవారం జరిగే సమావేశంలో టీ కాంగ్రెస్ సీనియర్ నేతలు వారి అజెండాను ఖరారు చేసే అవకాశం ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios