హైదరాబాద్: వామన్ రావు దంపతుల హత్య  టీఆర్ఎస్ హత్యేనని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గురువారం నాడు ఆయన ఈ ఘటనపై స్పందించారు. ఈ హత్యలను సీఎం కేసీఆర్ కనీసం ఖండించని విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

పోలీసు కమిషనర్ టీఆర్ఎస్ కు తొత్తుగా పనిచేస్తున్నాడని ఆయన ఆరోపించారు. హోం మంత్రి పూర్తి డమ్మీ అని ఆయన విమర్శించారు. వామన్ రావు దంపతులను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన చెప్పారు.

also read:వామన్‌రావు దంపతుల హత్య: నివేదిక కోరిన తెలంగాణ హైకోర్టు

తనకు ప్రాణహని ఉందని వామన్ రావు చెప్పినా కూడ ప్రభుత్వం పట్టించుకోలేదని ఉత్తమ్ విమర్శలు గుప్పించారు. ఈ విషయమై హైకోర్టు సీజేను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. అంతేకాదు ఈ  హత్యలపై సుప్రీంకోర్టు సీజేకు లేఖ రాస్తామని తెలిపారు.

ఈ నెల 17వ తేదీన పెద్దపల్లి జిల్లాలోని  కాల్వచర్లలో వామన్ రావు దంపతులను దుండగులు నరికి చంపారు. ఈ హత్యలను నిరసిస్తూ రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో విధులను బహిష్కరించి న్యాయవాదులు తమ నిరసనను కొనసాగించారు.