గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన : కేసీఆర్ తొమ్మిదేళ్లుగా నీరోలా వ్యవహరిస్తున్నాడు.. రేవంతరెడ్డి ఫైర్
తొమ్మిదేళ్లుగా నీరోలా వ్యవహరిస్తున్నాడంటూ కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. నిరుద్యోగుల ఆర్తనాదాలు వినకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు.
హైదరాబాద్ : నిరుద్యోగుల ఆర్తనాదాలు వినకుండా తొమ్మిదేళ్లు నీరోను తలపించిన కేసీఆర్ అంటూ టీపీసీసీ అధినేత రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఓట్లు, సీట్లే లక్ష్యంగా ఉద్యోగార్ధులకు సన్నద్ధతకు సమయం ఇవ్వకుండా అగ్ని ‘పరీక్ష’పెడుతున్నాడంటూ మండిపడ్డాడు.
గ్రూప్ -2 పరీక్షల వాయిదాకు లక్షలాది మంది చేస్తోన్న డిమాండ్ పై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానన్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ట్వీట్టర్ వేదికగా మాట్లాడారు.
ఇదిలా ఉండగా, గురువారం నాడు గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలంటూ అభ్యర్థులు టీఎస్‌పీఎస్‌సీని ముట్టడించారు. గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా వేయాలి, దీనిమీద స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో టీఎస్‌పీఎస్‌సీ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మరోవైపు గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని గురువారంనాడు 150 మంది అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బ్యాంకు ఉద్యోగాలకు పరీక్షలు, గురుకుల పరీక్ష, జూనియర్ లెక్చరర్ పరీక్షలు, ఇతర పోటీ పరీక్షలు ఉన్నందున గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని ఆ పిటిషన్ లో కోరారు.
టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-2 పరీక్షలను ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఆగస్టులోనే ఇతర పోటీ పరీక్షలు కూడా ఉండడంతో.. ఏ పరీక్షకు ప్రిపేర్ కావాలో తెలియని అయోమయంలో నిరుద్యోగులు పడిపోయారు. దీంతో సందిగ్ధత నెలకొందని అభ్యర్థులు చెబుతున్నారు.
గ్రూప్-2 పరీక్షల తేదీలు వెలువడగానే వారం రోజుల క్రితం టీఎస్‌పీఎస్‌సీ చైర్మెన్ ను గ్రూప్-2 అభ్యర్థులు కలిశారు. పరీక్షలను మూడు నెలలు వాయిదా వేయాలని కోరారు. ఈ విషయమై టీఎస్‌పీఎస్‌సీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో గురువారం ఉదయం నుండి అభ్యర్థులు ఆందోళన నిర్వహిస్తున్నారు.