పేపర్ లీక్ వెనుక కేటీఆర్ పీఏ హస్తం.. ఆ వూళ్లో 100 మందికి వందకుపైగా మార్కులెలా : రేవంత్ సంచలనం
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో పెద్దలను కాపాడేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అలాగే దీని వెనుక కేటీఆర్ పీఏ వున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌కు సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేపర్ లీక్ వెనుక కేటీఆర్ పీఏ హస్తం కూడా వుందని ఆరోపించారు. అతని సొంతూరులో 100 మంది అభ్యర్ధులకు 100కి పైగా మార్కులు రావడంపై రేవంత్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దానిపైనా విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కేసులో పెద్దలను కాపాడేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఆరోపించారు. కేటీఆర్ షాడో సీఎంలా వ్యవహరిస్తున్నారని.. కేసీఆర్ సమీక్షా సమావేశంలో సిట్ అధికారుల్ని ఎందుకు పిలవలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యులను కాపాడుతూ.. కిందస్థాయి సిబ్బందిని ఎందుకు బాధ్యుల్ని చేయలేదని ఆయన నిలదీశారు. కమీషన్ ఛైర్మన్‌కు జనార్థన్ రెడ్డి, సెక్రటరీకి ప్రవీణ్ పీఏగా వ్యవహరిస్తున్నారని .. పెద్దోళ్లకు తెలియకుండా వాళ్లు వ్యవహారం నడుపుతారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పెద్ద తలకాయల్ని కాపాడటానికి కేటీఆర్ ప్రయత్నిస్తున్నాడని.. దీనిపై సీబీఐ విచారణ కోరుతోందని ఎన్ఎస్‌యూఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని ఆయన తెలిపారు. హైకోర్టులో సోమవారం కేసు విచారణకు వస్తుందని రేవంత్ చెప్పారు.
Also REad: పేపర్ లీక్ .. వాళ్లిద్దరే నిందితులు కాదు, పెద్ద తలకాయల్ని రక్షించే యత్నం : కేటీఆర్‌పై రేవంత్ ఆరోపణలు
కేసును తప్పుదోవ పట్టించేందుకు కేటీఆర్ హడావుడిగా బయటకు వచ్చాడని.. విద్యా శాఖ మంత్రితో మాట్లాడకుండానే ఆయన ఎలా సమాధానం ఇచ్చాడని రేవంత్ రెడ్డి నిలదీశారు. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం, టీఆర్ఎస్ పెద్దలను కాపాడేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నాడని ఆయన ఆరోపించారు. సీబీఐ బీజేపీ చేతిలో వుందని బయపడితే .. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేందుకు కేసీఆర్ ముందుకు రావాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కల్వకుంట్ల కుటుంబం అగ్నిపరీక్షకు సిద్ధం కావాలన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జరిగిన అన్ని పరీక్షలపై విచారణ చేయించాలని రేవంత్ డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌కు సంబంధించి 9 మందిని అరెస్ట్ చేస్తే.. ఇద్దరినే నిందితులని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. పేపర్ లీక్ నేపథ్యంలో రేపు ఎల్లారెడ్డిలో నిరుద్యోగుల నిరాహార దీక్ష చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.