టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై స్పందించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.  ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం వెనుక పెద్దల హస్తం వుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రశేఖర్ రావు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిర్వహించిన పోటీ పరీక్షలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై స్పందించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఆయన యాత్ర ఈరోజు నిజామాబాద్ జిల్లా మోపాల్‌ మీదుగా సాగుతోంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గతంలోనూ జేఎల్ఎం, ఎంసెట్ వంటి పలు పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకైనట్లు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం 30 లక్షల మంది విద్యార్ధుల జీవితాలతో ఆటలాడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రశేఖర్ రావు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిర్వహించిన పోటీ పరీక్షలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

సిట్టింగ్ జడ్జితో అయితేనే పారదర్శకంగా విచారణ జరుగుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం వెనుక పెద్దల హస్తం వుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దలు వుండటం వల్లే టీఎస్‌పీఎస్సీ ఇంత వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని రేవంత్ ఆరోపించారు. పోలీసులైనా ఈ వ్యవహారాన్ని సుమోటాగా స్వీకరించాలి కదా అని ఆయన నిలదీశారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలన్నీ టీఎస్‌పీఎస్సీ చుట్టూనే తిరుగుతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. 

Also REad: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ .. తెలంగాణ సర్కార్ సీరియస్‌, వివరణ ఇవ్వాల్సిందిగా కమీషన్‌కు ఆదేశం

పబ్లిక్ సర్వీస్‌ కమీషన్‌లోనే ఉద్యోగుల కొరత వుందన్న ఆయన.. నిబంధనల ప్రకారం సంస్థలో 400 మంది ఉద్యోగులు వుండాలని , కానీ 80 మందే ఉన్నారని ఎద్దేవా చేశారు. వారిలోనేప 50 వరకు డ్రైవర్లు, స్వీపర్లేనని రేవంత్ దుయ్యబట్టారు. రాజకీయాలకు పనికిరారనే కవిత, బోయిన్‌పల్లి వినోద్‌లను ప్రజలు ఓడించారని ఆయన వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యులు ఒక్కరోజు ఉద్యోగంలో లేకపోతే కేసీఆర్ తట్టుకోలేని.. అందుకే కవితను ఎమ్మెల్సీ చేసి, వినోద్‌కు ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారని రేవంత్ ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా వున్నా నియామక ప్రక్రియ చేపట్టరని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఓ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని రేవంత్ దుయ్యబట్టారు. టీఎస్‌పీఎస్సీ కమీషన్‌లో వున్న వారికైనా సభ్యులుగా వుండేందుకు అర్హతా వుందా అని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. 

ఇదిలావుండగా.. ఈ నెల 12, 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన రెండు పరీక్షలను టీఎస్‌పీఎస్‌సీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 12న టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్ పరీక్ష, ఈ నెల 15, 16 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామాకాలపై పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలకు సంబందించిన ప్రశ్నా పత్రాల లీకేజీపై సమాచారం రావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. ఈ నెల 5న జరిగిన ఏఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైనట్టుగా పోలీసులు గుర్తించారు. టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల పరీక్షల పేపర్లు లీకయ్యాయో లేదో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రవీణ్ బాగోతం, హానీ ట్రాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చాయి