నేను పప్పు అయితే... అతను గన్నేరు పప్పు:కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేటీఆర్ కు తనదైన శైలిలోనే రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు.
హైదరాబాద్: ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చే పప్పు నేనైతే... ప్రజలకు హానికలిగించే గన్నేరు పప్పు కేటీఆర్ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి , ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీలు నిన్న పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ షేర్ చేశారు. కేసీఆర్ పై విమర్శలు చేశారు.
లక్ష్మీబ్యారేజీ కుంగిపోయిన ప్రాంతాన్ని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు పరిశీలించే సమయంలో చేసిన ఫోటోపై కేటీఆర్ విమర్శలు చేశారు. తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి, ఆలిండియా పప్పు రాహుల్ గాంధీలు మేడిగడ్డకు వెళ్లి ఏం పరిశీలించారని ప్రశ్నించారు.
కేటీఆర్ వ్యాఖ్యలను శుక్రవారంనాడు మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వచ్చారు. ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
ప్రజల ఆరోగ్యాన్ని పప్పు మేలు చేస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. తమ ప్రాంతంలో పండే కందిపప్పు ఎంతో నాణ్యమైందన్నారు. అనారోగ్యంగా ఉన్న సమయంలో ముద్దపప్పు, పప్పు తింటే ఆరోగ్యం బాగుపడుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. తమను విమర్శించిన కేటీఆర్ గన్నేరు పప్పు అంటూ సెటైర్లు వేశారు. ప్రజలకు హానికరమైన గన్నేరు పప్పుతో దూరంగా ఉండాలని ప్రజలను కోరారు రేవంత్ రెడ్డి.గన్నేరు పప్పు తింటే చనిపోతారన్నారు. అందుకే గన్నేరు పప్పుతో జాగ్రత్తగా ఉండాలని రేవంత్ రెడ్డి కోరారు.
also read:నియంత ముసుగులో ఉన్న క్రిమినల్ పొలిటిషియన్: కేసీఆర్ పై రేవంత్ ఫైర్
ఇదిలా ఉంటే వామపక్షాలతో పొత్తు చర్చలు కొనసాగుతున్నాయని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ విషయమై తమ పార్టీ జాతీయ నాయకత్వం నుండి తాజాగా ఆదేశాలు అందాయన్నారు. భట్టి విక్రమార్క నేతృత్వంలోని కమిటీ చర్చలు చేస్తుందని ఆయన తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిపోయింది. దీంతో బ్యారేజీపై నుండి మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ బ్యారేజీ కుంగిపోవడంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం ఇటీవల పరిశీలన నిర్వహించింది.ఈ విషయమై కేంద్రానికి నివేదికను కూడ అందించింది.