తెలంగాణ డీజీపీకి రేవంత్ రెడ్డి ఫోన్: ఖమ్మం సభకు రాకుండా వాహనాల నిలిపివేతపై ఆగ్రహం
తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఖమ్మం సభకు రాకుండా వాహనాలు అడ్డుకోవడంపై డీజీపీతో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదివారంనాడు ఫోన్ చేశారు. ఇవాళ ఖమ్మంలో జరిగే సభకు వచ్చే వాహనాలను పోలీసులు అడ్డుకోవడంపై రేవంత్ రెడ్డి డీజీపీతో మాట్లాడారు. సుమారు 1700 వాహనాలను పోలీసులు సీజ్ చేశారని ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఖమ్మం సభకు వాహనాలు రాకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని రేవంత్ రెడ్డి డీజీపీ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ పరిస్థితి సరైంది కాదన్నారు. పరిస్థితి చేయి దాటితే అందుకు పోలీస్ శాఖే బాధ్యత వహించాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఇవాళ ఖమ్మంలో ముగియనుంది.ఈ పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని జన గర్జన పేరుతో ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ను నిర్వహిస్తుంది.ఈ సభలోనే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ సభ ద్వారానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయనుందనే విషయమై ఈ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ వివరించనుంది.
also read:ఖమ్మం నుండే కేసీఆర్ పతనం: బీఆర్ఎస్ పై పొంగులేటి ఫైర్
ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ దఫా తెలంగాణలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. కర్ణాటకలో అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో జోష్ నెలకొంది. కర్ణాటక ఫార్మూలాతోనే తెలంగాణలో కూడ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్తుంది. తెలంగాణలో అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని పార్టీ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి తేల్చి చెప్పింది. పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం నేతలు తమ మధ్య ఉన్న సమస్యలను పక్కన పెట్టాలని కూడ పార్టీ నాయకత్వం సూచించింది.