తెలంగాణలో భారీ వరదల నేపథ్యంలో పరిస్ధితిని జాతీయ విపత్తుగా గుర్తించాలని ప్రధాని నరేంద్ర మోడీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. పంట నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపి.. ఎకరాకు రూ.15 వేల పరిహారం, విత్తనాలు, సబ్సిడీలు ఇవ్వాలని ప్రధానిని టీపీసీసీ చీఫ్ కోరారు.  

తెలంగాణలో భారీ వరదల నేపథ్యంలో పరిస్ధితిని జాతీయ విపత్తుగా గుర్తించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ మేరకు శనివారం ఆయన ప్రధానికి లేఖ రాశారు. తక్షణమే రాష్ట్రానికి రూ.2 వేల కోట్ల నిధులు విడుదల చేయడంతో పాటు వరద సహాయక చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి కోరారు. భారీ వరదల కారణంగా రాష్ట్రం అతలాకుతలమైందని... దాదాపు 11 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయామని ఆయన లేఖలో పేర్కొన్నారు. వరద పరిస్ధితిని అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని రేవంత్ దుయ్యబట్టారు. 

ALso REad:‘‘ పైసలుంటేనే ప్రగతి భవన్ తలుపులు తెరచుకుంటాయా’’ : కాళేశ్వరం పంపుహౌస్‌‌లు మునకపై రేవంత్

ఒక్క ఎకరం కూడా నీట మునగలేదని మంత్రి కేటీఆర్ చెబుతున్నారని.. అలా అని నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఒకవేళ తాను చెప్పింది నిజమైతే కేటీఆర్ రైతులకు క్షమాపణ చెప్పి.. ముక్కు నేలకు రాస్తారా అంటూ టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. వర్షాలు, వరదల కారణంగా వందలాది గ్రామాల్లోకి వరద నీరు చేరిందని.. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోడీని రేవంత్ కోరారు. అలాగే రాష్ట్రంలో పంట నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపి.. ఎకరాకు రూ.15 వేల పరిహారం, విత్తనాలు, సబ్సిడీలు ఇవ్వాలని ప్రధానిని టీపీసీసీ చీఫ్ కోరారు. 

మరోవైపు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ పంపు హౌస్‌లు మునగడంపై శుక్రవారం రేవంత్ స్పందించారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. ‘‘ ప్రాజెక్టుల నిర్మాణానికి లక్ష కోట్లకు పైగా వెచ్చించామని చెబుతున్న కేసీఆర్ ప్రభుత్వం... వాటి నిర్వహణకు రూ.1000 కోట్లు కూడా ఎందుకివ్వడం లేదు? . సింపుల్... కమీషన్లు లేకపోతే కల్వకుంట్ల వారు కదలరా…?! పైసలుంటేనే ప్రగతి భవన్ తలుపులు తెరుచుకుంటాయా…?! ’’ 

‘‘ రాష్ట్రంలో భారీ వర్షాలతో 11 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. 
అసలు నష్టమే జరగలేదని ట్విట్టర్ పిట్ట కారుకూతలు కూస్తోంది. ప్రజల కష్టం... పంట నష్టం ఇంత తీవ్రంగా ఉంటే కళ్లకు కనిపించడం లేదా? ’’ అంటూ రేవంత్ మండిపడ్డారు. 

Scroll to load tweet…