రాష్ట్రంలో ప్రాజెక్ట్‌ల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కమీషన్లు లేకపోతే కల్వకుంట్ల వారు కదలరా అని ప్రశ్నించారు. 

రాష్ట్రంలో వరద పరిస్థితులపై స్పందించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) . ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పంపుహౌస్‌లు మునగడంతో ఆయన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం రేవంత్ ట్వీట్ చేశారు. 

‘‘ ప్రాజెక్టుల నిర్మాణానికి లక్ష కోట్లకు పైగా వెచ్చించామని చెబుతున్న కేసీఆర్ ప్రభుత్వం... వాటి నిర్వహణకు రూ.1000 కోట్లు కూడా ఎందుకివ్వడం లేదు? . సింపుల్... కమీషన్లు లేకపోతే కల్వకుంట్ల వారు కదలరా…?! పైసలుంటేనే ప్రగతి భవన్ తలుపులు తెరుచుకుంటాయా…?! ’’ 

‘‘ రాష్ట్రంలో భారీ వర్షాలతో 11 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. 
అసలు నష్టమే జరగలేదని ట్విట్టర్ పిట్ట కారుకూతలు కూస్తోంది. ప్రజల కష్టం... పంట నష్టం ఇంత తీవ్రంగా ఉంటే కళ్లకు కనిపించడం లేదా? ’’ అంటూ రేవంత్ మండిపడ్డారు. 

మరోవైపు.. రాష్ట్రంలోని వరదలు, వర్షాల నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (bhatti vikramarka) స్పందించారు. వరద సహాయక చర్యల్లో (rescue operation) పాల్గొనాలని కాంగ్రెస్ (congress) శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. బాధితులకు నిరంతరం అండగా ఉండాలని విక్రమార్క సూచించారు. రాష్ట్రంలో వరదల తీవ్రత భయంకరంగా ఉందని...ప్రజలు ఆస్తులు, పంటలు, ఇళ్లు అన్ని కోల్పోయి నష్టాల్లో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితులకు ఆహారం, పాలు, మంచినీరు, మందులు, నిత్యావసర వస్తువులు, బిస్కెట్లు, బట్టలు ఏది అవసరం ఉంటే అది అందించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ముందుండి పని చేయాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. 

కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజా సేవలో సైనికులు లాగా పని చేసి ప్రజల అవసరాలు తీర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలు గతంలో ఎన్నడూ లేనంత కష్టాలలో ఉన్నారని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు వరద అంచనాలు, ముందస్తు జాగ్రత్తలు, ప్రజా అవసరాలు తీర్చడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ శ్రేణులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టాలను తీర్చడంలో ముందుండి పని చేయాలని విక్రమార్క కోరారు. 

Scroll to load tweet…