రేపటి నుంచి రోడ్ల మీదనే వుంటామని టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారు. కేసీఆర్‌ను గద్దె దించేవరకూ విశ్రమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. నిరసన సెగ ముఖ్చమంత్రికి చూపిస్తామన్నారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy). గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపటి నుంచి రోడ్ల మీదనే వుంటామని రేవంత్ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారు. కేసీఆర్‌ను గద్దె దించేవరకూ విశ్రమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. నిరసన సెగ ముఖ్చమంత్రికి చూపిస్తామన్నారు. 

అంతకుముందు గురువారం హైదరాబాద్‌‌ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఆయన‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డిని పోలీసులు వారి వాహనాల్లోనే తిప్పారు. తొలుత జూబ్లీహిల్స్ నుంచి లంగర్‌హౌస్ వైపు తీసుకెళ్లిన పోలీసులు.. తర్వాత ఆయనను గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. వివిధ రూపాల్లో నిరసన తెలపాలని యువజన కాంగ్రెస్ పేర్కొంది. 

ఈ క్రమంలోనే ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. రేవంత్ ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే రేవంత్ రెడ్డి అరెస్ట్‌పై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రేవంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

ఇక, ఈ పరిణామాలపై రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేసీఆర్ జన్మదినం...ప్రతిపక్ష నేతల జైలుదినం కావాలా అని ప్రశ్నించారు. నిరుద్యోగుల తరపున ప్రశ్నించడమే తాము చేసిన నేరమా అంటూ ప్రశ్నలు సంధించారు. ఉద్యోగాల భర్తీకి మెగా నోటిఫికేషన్ డిమాండ్ చేస్తూ అన్నీ మండల కేంద్రాల్లో కేసీఆర్ దిష్ఠిబొమ్మను దగ్ధం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. #TelanganaUnemployementDay అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జత చేశారు.