కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వరంగల్ డిక్లరేషన్ ను అమల్లోకి తీసుకొస్తామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రైతు చట్టాలు వెనక్కి తీసుకునేలా కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేసిందని ఆయన గుర్తుచేశారు

తెలంగాణలో దళితులు , గిరిజనులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy). గురువారం గాంధీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఇటీవల ఏఐసీసీ శాశ్వత ఆహ్వానితుడిగా నియమితులైన మాజీ ఎంపీ టీ.సుబ్బిరామిరెడ్డికి (t subbarami reddy) సన్మానం చేశారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. దళితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు రాలేదని, మూడెకరాల భూమి రాలేదని రేవంత్ ఎద్దేవా చేశారు. రైతుల పాలిట శాపంలా మారిన ధరణి పోర్టల్ ను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామన్నారు. 

దళితులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూముల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోందని రేవంత్ ఆరోపించారు. రైతు కమీషన్ ఏర్పాటు చేసి రైతులకు అండగా వుంటామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఏయే పంటలను ఎంతెంత ధరలకు కొంటామో తెలియజేశామని రేవంత్ తెలిపారు. రైతు చట్టాలు వెనక్కి తీసుకునేలా కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేసిందని ఆయన గుర్తుచేశారు. అందుకే రాహుల్ పై కక్ష గట్టి మూసేసిన ఈడీ కేసును తిరగదోడుతున్నారని రేవంత్ ఆరోపించారు. దీనిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగినట్లు ఆయన గుర్తించారు. 

ALso Read:టీపీసీసీ చీఫ్‌గా ఏడాది ప్రస్థానం.. కాంగ్రెస్ పటిష్టత కోసం శ్రమిస్తున్న రేవంత్, ఆసక్తికర ట్వీట్

ఇకపోతే.. ఇవాళ్టీతో టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పగ్గాలు అందుకుని ఏడాది కావొస్తోంది. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో కలిసి వున్న ఫోటోలతో పాటు.. టీపీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి బాధ్యతలు తీసుకుంటున్న ఫోటోలను రేవంత్ పోస్ట్ చేశారు. తనపై విశ్వాసం వుంచి బాధ్యతలు అప్పగించారని ట్వీట్ లో పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు, అభిమానులు రేవంత్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. 

కాగా.. రాష్ట్ర విభజన తర్వాత కష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ కాంగ్రెస్ ను గాడిలో పెట్టగలిగే సమర్థత రేవంత్ కు వుందని నమ్మిన కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను 2021 జూన్ 26న టీపీసీసీ చీఫ్ గా ప్రకటించింది. అనంతరం జూలై 7న తన అభిమానులు, సన్నిహితులు, పార్టీ నేతల సమక్షంలో రేవంత్ గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పటిష్టత కోసం ఆయన శ్రమిస్తున్నారు. దళిత గిరిజన దండోరాతో పాటు వరంగల్ డిక్లరేషన్ వంటి భారీ సభల ద్వారా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. రానున్న ఎన్నికలకు పక్కా వ్యూహాంతో ముందుకు వెళ్లాలని ఆయన భావిస్తున్నారు.