తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టి ఈరోజుతో ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర ఫోటోలను ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ కు కాంగ్రెస్ శ్రేణులు అభినందనలు తెలియజేస్తున్నాయి.
ఎన్నో అంచనాలు, తర్జనభర్జనల మధ్య తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గతేడాది బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ్టీతో ఆయన టీపీసీసీ చీఫ్ గా పగ్గాలు అందుకుని ఏడాది కావొస్తోంది. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో కలిసి వున్న ఫోటోలతో పాటు.. టీపీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి బాధ్యతలు తీసుకుంటున్న ఫోటోలను రేవంత్ పోస్ట్ చేశారు. తనపై విశ్వాసం వుంచి బాధ్యతలు అప్పగించారని ట్వీట్ లో పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు, అభిమానులు రేవంత్ కు అభినందనలు తెలియజేస్తున్నారు.
ALso Read:టీ కాంగ్రెస్‌లో దుమారం రేపుతున్న రేవంత్ వన్ మ్యాన్ షో.. రగిలిపోతున్న సీనియర్లు..!
కాగా.. రాష్ట్ర విభజన తర్వాత కష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ కాంగ్రెస్ ను గాడిలో పెట్టగలిగే సమర్థత రేవంత్ కు వుందని నమ్మిన కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను 2021 జూన్ 26న టీపీసీసీ చీఫ్ గా ప్రకటించింది. అనంతరం జూలై 7న తన అభిమానులు, సన్నిహితులు, పార్టీ నేతల సమక్షంలో రేవంత్ గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పటిష్టత కోసం ఆయన శ్రమిస్తున్నారు. దళిత గిరిజన దండోరాతో పాటు వరంగల్ డిక్లరేషన్ వంటి భారీ సభల ద్వారా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. రానున్న ఎన్నికలకు పక్కా వ్యూహాంతో ముందుకు వెళ్లాలని ఆయన భావిస్తున్నారు.
అయితే రేవంత్ తీరు మరోసారి ఆ పార్టీలో తీవ్ర దుమారానికి కారణమవుతుంది. కొంతకాలంగా అంతా బాగానే ఉన్నట్టు కనిపించిన.. మరోసారి రేవంత్ తీరుపై కొందరు కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరిద్దరు నేతలు రేవంత్‌పై బహిరంగంగా కామెంట్ చేసిన.. పలువురు సినీయర్లు మాత్రం లోలోపల రగిలిపోతున్నారు. పార్టీలో రేవంత్ వన్ మ్యాన్ షోపై మండిపడుతున్నారు. ఇతర పార్టీల నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం, నిరనస కార్యక్రమాలను చేపట్టడం.. ఇలా పలు విషయాల్లో రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ చేపట్టిన ధరణి రచ్చబండ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల్లో కాకుండా ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో నిర్వహించడంపై కూడా పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఢిల్లీ వేదికగా పార్టీ నిర్వహించే ఆందోళన కార్యక్రమాలు, వాటి తేదీల గురించి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారని.. అయితే అందుకు సంబంధించి పార్టీ కేంద్ర నాయకత్వంతో ఎటువంటి చర్చ జరగలేదని కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు చెప్పినట్టుగా డెక్కన్ క్రానికల్ ఓ కథనంలో పేర్కొంది. మరోవైపు ఇతర పార్టీల నుంచి రేవంత్‌కు మద్దతుగా ఉండేవారిని మాత్రమే కాంగ్రెస్‌లోకి తీసుకురావడంపై కొందరు సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటువంటి వారితో భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అటువంటి వారిని రానున్న ఎన్నికల్లో టికెట్స్ ఇస్తే.. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే వారు పార్టీకి విధేయత చూపకపోవచ్చని అంటున్నారు. ఈ విషయంలో రేవంత్ వ్యుహాలను వారు వ్యతిరేకిస్తున్నారు
