టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. మన ఊరు మన పోరు కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డికి  వెళ్తుండగా తూప్రాన్ మండలం ఇమాంపూర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి రేవంత్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు

టీపీసీసీ (tpcc) చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి (revanth reddy) తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆయన కాన్వాయికి పెనుప్రమాదం తప్పింది. తూప్రాన్ మండలం ఇమాంపూర్‌ వద్ద కాన్వాయిలోని కార్లు ఒక్కదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నాలుగు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఆదివారం ‘మన ఊరు .. మన-పోరు’ (Mana Ooru-Mana Poru ) బహిరంగ సభను కామారెడ్డి జిల్లా (kama reddy) ఎల్లారెడ్డిలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ నేతలు ఏర్పాటు చేశారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఈ సభకు రేవంత్‌రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి వెళ్తుండగానే రేవంత్ కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరుగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రేవంత్ మరో వాహనంలో ఎల్లారెడ్డికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. 

అంతకుముందు నిన్న తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఎన్‌ఎస్‌యూఐ మాజీ జాతీయ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్‌ (meenakshi natarajan) ఆధ్వర్యంలో 25 మందితో కూడిన బృందం 600 కిలోమీటర్ల మేర సర్వోదయ సంకల్ప పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. భూదాన్‌ పోచంపల్లి నుంచి మహారాష్ట్రలోని సేవాగ్రామ్‌ వరకు చేపడుతున్న ఈ యాత్ర మెదక్‌ జిల్లాలోకి ప్రవేశించింది. వీరికి మద్దతుగా రేవంత్‌రెడ్డి శనివారం పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.

వరి కొనని సర్కారును ప్రజలే ఉరి తీస్తారని రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. కాళేశ్వరం మూడో టీఎంసీ, మల్లన్నసాగర్‌, కొండ పోచమ్మకు భూములు త్యాగం చేసిన రైతులనే.. రీజినల్‌ రింగ్‌ రోడ్డు పేరుతో మరోసారి దగా చేసేందుకు యత్నిస్తున్నారని రేవంత్‌ ఆరోపించారు. రూ.కోట్లు పలికే ఎకరా భూమికి రూ.10 లక్షల పరిహారం ఇస్తామనడం అన్యాయమన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్‌ ద్వారా ఎంతో మంది భూములు కోల్పోతున్నారని రేవంత్ ఆరోపించారు. సీఎం ఫామ్‌ హౌజ్‌కు నీటిని తరలించేందుకే కొండపోచమ్మ రిజర్వాయర్‌ నిర్మించారని ఆయన వ్యాఖ్యానించారు. మీనాక్షి నటరాజన్‌ మాట్లాడుతూ.. ఇది రాజకీయ పరమైన పాదయాత్ర కాదని స్పష్టం చేశారు. పేదల్లో ప్రతి ఒక్కరికీ భూమి ఉండాలని, అది సాధించేందుకే యాత్ర చేపట్టినట్లు మీనాక్షి వెల్లడించారు.