Asianet News TeluguAsianet News Telugu

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్.. ఈడీకి రేవంత్ రెడ్డి ఫిర్యాదు, ఆ డబ్బంతా విదేశాలకు తరలించారన్న టీపీసీసీ చీఫ్

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈడీకి ఫిర్యాదు చేశారు. పేపర్ లీక్ ద్వారా వచ్చిన సొమ్మును ప్రవీణ్, రాజశేఖర్‌లు హవాలా మార్గంలో విదేశాలకు తరలించారని.. అందుకే తాము ఈడీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. 

tpcc chief revanth reddy complaint to ed on tspsc paper leak case ksp
Author
First Published Mar 31, 2023, 2:36 PM IST

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయని, హవాలా కోణం కూడా వుందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం లక్షల మంది ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. మనుషుల వేషంలో మృగాలు రాష్ట్రాన్ని ఏలుతున్నాయని తీవ్ర వ్యాఖయలు చేశారు. నియామక ప్రక్రియ జాగ్రత్తగా చేయాలని.. ఇంత జరిగినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదంటూ రేవంత్ దుయ్యబట్టారు. ప్రశ్నాపత్రాలను వందల కోట్లకు అమ్ముకుంటున్నారని.. దీనికి సంబంధించిన ఆధారాలు బయటపెడితే, విపక్షాలపైనే కేసులు పెడుతున్నారని.. సిట్‌తో నోటిసులు ఇప్పిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

న్యాయం చేయాలని కోరుతూ రోడ్డెక్కిన విద్యార్ధులపై కేసులు పెట్టడంతో పాటు అక్రమంగా అరెస్ట్‌లు చేస్తున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. విద్యార్ధులపై కేసులు పెట్టడంతో పాటు అరెస్ట్‌ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పేపర్ లీక్ కేసులో కోట్ల రూపాయలను కొల్లగొట్టిన వారిని అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాన్ఫిడెన్షియల్ రూమ్ ఇన్‌ఛార్జ్‌ శంకర్ లక్ష్మీకి తెలియకుండా ఎవ్వరూ లోనికి వెళ్లడానికి వీల్లేదన్నారు. ఛైర్మన్, సెక్రటరీకి తెలియకుండా ఎవ్వరూ ఏం చేయలేరని ఆయన ఆరోపించారు. సిట్ శంకర్ లక్ష్మీని విట్‌నెస్ కింద వుంచిందని, కానీ నిందితురాలిగా చేర్చాలని రేవంత్ డిమాండ్ చేశారు. 

ALso REad: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్: రూ. 25 లక్షలు వసూలు చేసిన ఢాక్యానాయక్

ప్రవీణ్, రాజశేఖర్‌లదే చిన్న పాత్రేనన్న ఆయన ప్రభుత్వ పెద్దలకు ఈ కేసుతో సంబంధాలు వున్నాయని ఆరోపించారు. గతంలో నయీం కేసు, డ్రగ్స్ కేసు, బోధన్ భూకుంభకోణాలను సిట్ విచారించి వాటిని నీరుగార్చిందని రేవంత్ ఆరోపించారు. ఇప్పుడు పేపర్ లీక్ కేసును కూడా చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చిన్న ఉద్యోగులను బలి పశువులను చేసే ప్రయత్నం జరుగుతోందని రేవంత్ ఆరోపించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్  వేశామని.. దీనిపై విచారణ జరుగుతోందన్నారు. విదేశాల నుంచి వచ్చి అనేక మంది ఎన్ఆర్ఐలు పరీక్షలు రాశారని దీనిపైనా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పేపర్ లీక్ ద్వారా వచ్చిన సొమ్మును ప్రవీణ్, రాజశేఖర్‌లు హవాలా మార్గంలో విదేశాలకు తరలించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే తాము ఈడీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios