టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్: రూ. 25 లక్షలు వసూలు చేసిన ఢాక్యానాయక్
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అంశంపై సిట్ బృందం విచారణ సాగిస్తుంది. సిట్ విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో సిట్ అధికారుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. పేపర్ లీక్ కేసులో లక్షలాది రూపాయాలు చేతులు మారినట్టుగా సిట్ బృందం గుర్తించింది. పేపర్ లీక్ కేసులో ముగ్గురు నిందితులను సిట్ బృందం కస్టడీలోకి తీసుకొని విచారిస్తుంది. ఇవాళ రెండో రోజున ముగ్గురు నిందితులను సిట్ బృందం విచారిస్తుంది. షమీమ్, రమేష్, సురేష్ లను ఈ నెల 28వ తేదీన సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. ఐదు రోజుల పాటు ఈ ముగ్గురిని కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. పేపర్ లీక్ విషయంలో కీలకంగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలతో ఈ ముగ్గురు నిందితులకు సంబంధాలున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ ముగ్గురిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ముగ్గురి విచారణలో కీలక విషయాలను సిట్ బృందం సేకరించింది.
ఏఈ పేపర్ లీక్ తో రూ. 25 లక్షలను ఢాక్యానాయక్ వసూలు చేసినట్టుగా సిట్ బృందం గుర్తించింది. నీలేష్, గోపాల్ నాయక్ లు రూ. 13.5 లక్షలను ఢాక్యానాయక్ కు అందించినట్టుగా సిట్ గుర్తించింది. పొలం తాకట్టు పెట్టి ఈ డబ్బులను ఢాక్యానాయక్ కు అందించినట్టుగా సిట్ బృందం తమ దర్యాప్తులో గుర్తించింది. రాజేందర్ అనే యువకుడు ఢాక్యానాయక్ కు రూ. 5 లక్షలు ఇచ్చాడు. మరో వైపు శ్రీకాంత్ అనే వ్యక్తి రూ. 7.5 లక్షలను ఢాక్యానాయక్ కు అందించినట్టుగా సిట్ తమ దర్యాప్తులో గుర్తించింది . బంగారం తాకట్టు పెట్టి ఈ డబ్బులను తీసుకువచ్చారని సిట్ విచారణలో శ్రీకాంత్ ఒప్పుకున్నారని సమాచారం. దీంతో ఢాక్యానాయక్ బ్యాంకు ఖాతాలను సిట్ బృందం విచారిస్తుంది.
also read:టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ .. ఏఈ పరీక్షకు కొత్త తేదీలివే
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో ఇప్పటికే 13 మందిని సిట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్టైన నిందితులను విడతలవారీగా కస్టడీలోకి తీసుకొని సిట్ ప్రశ్నిస్తుంది. పేపర్ లీక్ అంశం వెలుగులోకి రావడంతో పలు పరీక్షలను టీఎస్‌పీఎస్‌సీ రద్దు చేసింది. కొన్ని పరీక్షలను వాయిదా వేసింది. టీఎస్‌పీఎస్ సీ పేపర్ లీక్ అంశంపై విపక్షాలు ప్రభుత్వంపై విమర్శల గుప్పిస్తున్నాయి. పేపర్ లీక్ తో వాయిదా పడిన కొన్ని పరీక్షలను ఈ ఏడాది మే మాసంలో నిర్వహించనున్నట్టుగా టీఎస్‌పీఎస్‌సీ తాజాగా ప్రకటించింది.