Asianet News TeluguAsianet News Telugu

అందరినీ సంప్రదించాకే మునుగోడు అభ్యర్ధి ఎంపిక.. త్వరలోనే ప్రచార రంగంలోకి : రేవంత్ రెడ్డి

అందరినీ సంప్రదించాకే మునుగోడు అభ్యర్ధిని ప్రకటించామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బీజేపీ, టీఆర్ఎస్‌ అకారణంగా ఎన్నికలు తెచ్చాయని.. టీఆర్ఎస్ ఇప్పటికీ అభ్యర్ధిని ప్రకటించలేని స్థితిలో వుందన్నారు. 

tpcc chief revanth reddy comments on selection of congress candidate for munugode bypoll
Author
First Published Sep 10, 2022, 9:31 PM IST

అందరినీ సంప్రదించాకే మునుగోడు అభ్యర్ధిని ప్రకటించామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. శనివారం టీ.కాంగ్రెస్ కీలక నేతలతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీకి సేవ చేసిన పాల్వాయి కుటుంబానికే టికెట్ ఇచ్చామన్నారు. వ్యాపారం కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని.. మునుగోడులో సభలు, రాజీవ్ జయంతిని ఊరూరా నిర్వహించామని రేవంత్ తెలిపారు. ప్రతి మండలానికి ఇద్దరు నాయకులను ఇన్‌ఛార్జిగా నియమించామని ఆయన చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్‌ అకారణంగా ఎన్నికలు తెచ్చాయని.. టీఆర్ఎస్ ఇప్పటికీ అభ్యర్ధిని ప్రకటించలేని స్థితిలో వుందన్నారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీయే ముందు సభ పెట్టిందని.. అభ్యర్ధిని కూడా కాంగ్రెస్సే ప్రకటించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌పై బీజేపీ, టీఆర్ఎస్ కుట్రలను ప్రజలకు వివరిస్తామని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు.. మునుగోడు ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ వేగంగా పావులు కదుపుతుంది. మునుగోడు ఉపఎన్నికకు తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉపఎన్నిక నోటిఫికేషన్ రాకపోయినప్పటికీ.. అభ్యర్థి ఎంపిక విషయంలో ఆలస్యం పార్టీకి నష్టం చేకూరుస్తుందనే అభిప్రాయంతో కాంగ్రెస్ అధిష్టానం ముందుగానే అభ్యర్థిని ఖరారు చేసింది. పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి... టికెట్ ఆశించిన భంగపడిన నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు. వారిని బుజ్జగించడంతో పాటు కాంగ్రెస్‌ పార్టీ విజయం కోసం పనిచేయాల్సిందిగా కోరనున్నారు. 

Also Read:మునుగోడు ఉప ఎన్నికలు 2022: కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి పేరు ఖరారు

ఈ క్రమంలోనే నేడు రేవంత్ రెడ్డితో పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కోసం కలిసి పనిచేయాలని రేవంత్ రెడ్డి.. ఇరువురు నేతలకు సూచించినట్టుగా తెలుస్తోంది. అంతర్గత సమస్యలు లేకుండా.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా చలమల కృష్ణారెడ్డిని రేవంత్ రెడ్డి బుజ్జగించినట్టుగా తెలుస్తోంది. మునుగోడు టికెట్ ఆశించిన పల్లె రవి, కైలాష్ నేత‌తో కూడా రేవంత్ మాట్లాడనున్నట్టుగా తెలుస్తోంది. ఇక, మునుగోడు టికెట్ రావడం అదృష్టంగా భావిస్తున్నట్టుగా పాల్వాయి స్రవంతి చెప్పారు. అసలైన కార్యకర్తలు ఎవరూ పార్టీని వీడటం లేదని అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షలాంటిదని.. దీనిని ఒక బాధ్యతగా తీసుకుని ముందుకు సాగుతానని చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios