Asianet News TeluguAsianet News Telugu

డీజీపీ మహేందర్ రెడ్డితో రేవంత్ బృందం భేటీ... రాహుల్ పాదయాత్రకు భద్రతపై చర్చ

తెలంగాణ డీజేపీ మహేందర్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తున్న నేపథ్యంలో భద్రత కల్పించాలని వారు డీజీపీని కోరారు. 

tpcc chief revanth reddy and congress leaders meet telangana dgp mahender reddy
Author
First Published Oct 1, 2022, 7:46 PM IST

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ పాదయాత్రకు భద్రత కల్పిస్తామని డీజీపీ చెప్పారని తెలిపారు. రాయచూర్ నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ ద్వారా తెలంగాణలోకి రాహుల్ యాత్ర అడుగుపెడుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. మక్తల్ నుంచి దేవరకద్ర, జడ్చర్ల, షాద్‌నగర్, రాజేంద్రనగర్, ఆరాంఘర్, చార్మినార్, నాంపల్లి, మొజాంజాహి మార్కెట్, గాంధీభవన్, విజయ్ నగర్ కాలనీ, మాసబ్ ట్యాంక్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, సంజీవరెడ్డి నగర్, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, బీహెచ్ఈఎల్, పటాన్ చెరు, సంగారెడ్డి, జోగిపేట్, పెద్ద శంకరం పల్లి, మద్దునూర్‌లలో రాహుల్ గాంధీ యాత్ర సాగుతుందన్నారు. 

అక్కడి నుంచి నాందేడ్ మీదుగా మహారాష్ట్రలోకి పాదయాత్ర అడుగుపెడుతుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో యాత్రకు సంబంధించి పోలీసులకు పూర్తి రూట్ మ్యాప్ ఇచ్చామని చెప్పారు. కేంద్రంలో వున్న బీజేపీ బ్రిటీషర్స్‌ని స్పూర్తిగా తీసుకుని దేశంలోని కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ఆలోచన చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మహాత్మాగాంధీ స్పూర్తితో రాహుల్ గాంధీ మరో దండి యాత్ర మాదిరి పాదయాత్ర చేపట్టారని ఆయన తెలిపారు. విచ్ఛిన్నకర శక్తుల నుంచి భారతదేశాన్ని కాపాడేందుకు గాను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర చేపట్టారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 

ALso REad:రాహుల్ గాంధీ పాదయాత్ర గాంధీజీ దండి యాత్ర లాంటిదే.. : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

అంతకుముందు మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సమావేశం అయ్యారు. ఈ సమావేశం కాంగ్రెస్ నేత సంపత్ నివాసంలో జరిగింది. రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రను సమన్వయం చేసుకునేందుకు మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలను కలిసినట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారు. భారత్ జోడో యాత్ర రూట్ పర్యవేక్షణ కోసం వారు వచ్చారని చెప్పారు. రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో దాదాపు 13 రోజులు ఉంటుందన్నారు. కర్ణాటకలోని రాయచూర్ నుంచి ముక్తల్‌లోకి రాహుల్ పాదయాత్ర ఎంటరవుతుందని తెలిపారు. 

తెలంగాణ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌లో రాహుల్ పాదయాత్ర ప్రవేశిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. పాదయాత్రపై మహారాష్ట్ర నాయకులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. పాదయాత్రను సమన్వయం చేసుకోవడంలో ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినట్టుగా చెప్పారు. మహారాష్ట్ర, తెలంగాణ నేతలతో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ, మహారాష్ట్రలో కామన్ సమస్యలు ఉన్నాయని అన్నారు. వాటిని ఎలా ఎక్స్పోజ్ చేయాలనే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చలు జరిపినట్టుగా చెప్పారు. 

మహారాష్ట్ర, తెలంగాణ నాయకుల బృందం కర్ణాటకకు వెళ్లి అక్కడ రాహుల్ పాదయాత్రను అధ్యాయనం చేస్తామన్నారు. పాదయాత్రలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని తమ ఆరాటమన్నారు. వంద సంవత్సరాల వరకూ మళ్ళీ ఇలాంటి యాత్ర ఉండదన్నారు. ఇది దేశ భవిష్యత్తును మార్చే పాదయాత్ర అన్నారు. రాహుల్ పాదయాత్ర గాంధీజీ చేపట్టిన దండియాత్ర లాంటిదేనని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios