Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ గాంధీ పాదయాత్ర గాంధీజీ దండి యాత్ర లాంటిదే.. : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సమావేశం అయ్యారు. ఈ సమావేశం కాంగ్రెస్ నేత సంపత్ నివాసంలో జరిగింది.

Revanth reddy about rahul gandhi bharat jodo yatra in telangana
Author
First Published Oct 1, 2022, 3:00 PM IST

మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సమావేశం అయ్యారు. ఈ సమావేశం కాంగ్రెస్ నేత సంపత్ నివాసంలో జరిగింది. రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రను సమన్వయం చేసుకునేందుకు మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలను కలిసినట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారు. భారత్ జోడో యాత్ర రూట్ పర్యవేక్షణ కోసం వారు వచ్చారని చెప్పారు. రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో దాదాపు 13 రోజులు ఉంటుందన్నారు. కర్ణాటకలోని రాయచూర్ నుంచి ముక్తల్‌లోకి రాహుల్ పాదయాత్ర ఎంటరవుతుందని తెలిపారు. 

తెలంగాణ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌లో రాహుల్ పాదయాత్ర ప్రవేశిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. పాదయాత్రపై మహారాష్ట్ర నాయకులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. పాదయాత్రను సమన్వయం చేసుకోవడంలో ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినట్టుగా చెప్పారు. మహారాష్ట్ర, తెలంగాణ నేతలతో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ, మహారాష్ట్రలో కామన్ సమస్యలు ఉన్నాయని అన్నారు. వాటిని ఎలా ఎక్స్పోజ్ చేయాలనే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చలు జరిపినట్టుగా చెప్పారు. 

మహారాష్ట్ర, తెలంగాణ నాయకుల బృందం కర్ణాటకకు వెళ్లి అక్కడ రాహుల్ పాదయాత్రను అధ్యాయనం చేస్తామన్నారు. పాదయాత్రలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని తమ ఆరాటమన్నారు. వంద సంవత్సరాల వరకూ మళ్ళీ ఇలాంటి యాత్ర ఉండదన్నారు. ఇది దేశ భవిష్యత్తును మార్చే పాదయాత్ర అన్నారు. రాహుల్ పాదయాత్ర గాంధీజీ చేపట్టిన దండియాత్ర లాంటిదేనని అన్నారు. 

ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీపాదయాత్రపై చర్చించేందుకు శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కర్ణాటకలోని రాయచూర్‌ నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మక్తల్‌లోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశిస్తుందని.. నిజామాబాద్ జిల్లా మద్నూర్ నుంచి మహారాష్ట్రలోని ఎంటర్‌ అవుతుందని చెప్పారు. 


రాహుల్ గాంధీ రూట్ మ్యాప్‌ను సమర్పించి భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరేందుకు పార్టీ నేతలు శనివారం డీజీపీ మహేందర్‌రెడ్డిని కలవనున్నట్టుగా చెప్పారు.. విద్యార్థులు, రైతులు, వివిధ వర్గాల ప్రజలు గాంధీని కలవాలని అభ్యర్థనలు పంపుతున్నారని అన్నారు. ఇక, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అక్టోబర్ 24 నాటికి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని.. అక్టోబర్ 4న ముగిసే చాన్స్ ఉందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. సీనియర్ నేతలు జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రాష్ట్ర నేతలతో చర్చించి తుది రూట్ మ్యాప్ సిద్ధం చేయనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios