కోర్ కమిటీ సభ్యులపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌‌ విడుదలపై తాను మాట్లాడితే టీఆర్ఎస్ ఎదురుదాడికి చేసిందని.. కానీ పీసీసీ చీఫ్‌ని తిడితే ఒక్క కాంగ్రెస్ నేత కూడా కౌంటర్ ఇవ్వలేదని ఉత్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎవరో ఒకరు కౌంటర్ ఇవ్వాలి కదా అని నిలదీశార్ పీసీసీ చీఫ్. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడటం సరికాదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చురకలంటించారు. మరో నేత షబ్బీర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ నేతలు బీసీ, రెడ్లుగా చీలిపోయి పీసీసీ పంచాయితీలోనే ఉన్నారన్నారు.

Also Read:మేం పవర్‌లోకి వస్తే.. నీకు తిప్పలే: ఎన్నికల కమీషనర్‌ నాగిరెడ్డిపై జగ్గారెడ్డి ఫైర్

కాగా గురువారం జరిగిన టీపీసీసీ కోర్ కమిటీ భేటీలో ఈ నెల 28వ తేదీన జరగనున్న ర్యాలీకి సంబంధించి అంశంపై ప్రధానంగా చర్చించారు. అదే విధంగా బుధవారం యునైటెడ్ ముస్లిం లీగ్‌ సభకు సంబంధించిన అంశంపై చర్చ జరిగింది.

అలాగే ఎంఐఎం ఆధ్వర్యంలో నిజామాబాద్‌‌లో జరిగే సభకు కాంగ్రెస్ తరపు నుంచి ఏ ఒక్కరూ వెళ్లకూడదని నిర్ణయించారు. అదే సమయంలో కోర్ కమిటీలో సభ్యులు కానివారిని సమావేశానికి ఎలా పిలుస్తారంటూ సీనియర్ నేత వీహెచ్ అలిగి బయటకు వెళ్లిపోయారు.

పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏ ఒక్కరిపైనా ఆగ్రహం వ్యక్తం చేయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తొలిసారిగా అసంతృప్తి వ్యక్తం చేయడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు కారణమైంది. 

Also Read:మున్సిపల్ పోల్స్‌పై కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ: బహిష్కరించిన వీహెచ్

కాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నాగిరెడ్డిలాంటి అధికారులు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. గాంధీభవన్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన టీఆర్ఎస్‌పై మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటిదని.. దేశంలో అనేక మంది కొడుకులను కన్నదని అందులో కేసీఆర్ ఒకరని ఆయన గుర్తుచేశారు. ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు.

ఓటర్ల జాబితా ప్రకటించకుండానే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్‌ను ఎన్నికల కమిషన్, పోలీస్ శాఖలే కాపాడుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.

మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ ఇవ్వకముందే టీఆర్ఎస్ కార్యకర్తల ఫేస్‌బుక్‌లోకి ఎలా వచ్చిందని జగ్గారెడ్డి ప్రశ్నించారు. పురపాలక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.

Also Read:టీపీసీసీ చీఫ్ పదవి కోసం ఏకం అవుతున్న రెడ్డి సామాజిక వర్గం నేతలు

రాష్ట్ర విభజనకు ముందు ఎన్నికల కమీషన్ అంటే ఒక నమ్మకం, గౌరవం ఉండేదని, కానీ ఎప్పుడైతే విభజన జరిగిందో ఆనాటి నుంచి ఈసీలో నమ్మకం, విశ్వాసం లేని కమీషనర్లు ఉన్నారని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.

ఎన్నికల కమీషన్ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలకు కసరత్తు చేయాలని కానీ ఇప్పుడున్న ఎన్నికల కమీషనర్ ముఖ్యమంత్రి ఆధీనంలో పనిచేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలకు నిధులపై జీవోలు వచ్చాయి కానీ.. నిధులు మాత్రం రాలేదని, నిధులు ఇవ్వకపోతే ఒక్క ఎమ్మెల్యేనైనా అడిగారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.