కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నాగిరెడ్డిలాంటి అధికారులు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. గాంధీభవన్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన టీఆర్ఎస్‌పై మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటిదని.. దేశంలో అనేక మంది కొడుకులను కన్నదని అందులో కేసీఆర్ ఒకరని ఆయన గుర్తుచేశారు. ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు.

Also Read:టీపీసీసీ చీఫ్ పదవి కోసం ఏకం అవుతున్న రెడ్డి సామాజిక వర్గం నేతలు

ఓటర్ల జాబితా ప్రకటించకుండానే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్‌ను ఎన్నికల కమిషన్, పోలీస్ శాఖలే కాపాడుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.

మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ ఇవ్వకముందే టీఆర్ఎస్ కార్యకర్తల ఫేస్‌బుక్‌లోకి ఎలా వచ్చిందని జగ్గారెడ్డి ప్రశ్నించారు. పురపాలక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.

రాష్ట్ర విభజనకు ముందు ఎన్నికల కమీషన్ అంటే ఒక నమ్మకం, గౌరవం ఉండేదని, కానీ ఎప్పుడైతే విభజన జరిగిందో ఆనాటి నుంచి ఈసీలో నమ్మకం, విశ్వాసం లేని కమీషనర్లు ఉన్నారని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.

Also Read:తెలంగాణలో పుర పోరు: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల, జనవరి 22న పోలింగ్

ఎన్నికల కమీషన్ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలకు కసరత్తు చేయాలని కానీ ఇప్పుడున్న ఎన్నికల కమీషనర్ ముఖ్యమంత్రి ఆధీనంలో పనిచేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలకు నిధులపై జీవోలు వచ్చాయి కానీ.. నిధులు మాత్రం రాలేదని, నిధులు ఇవ్వకపోతే ఒక్క ఎమ్మెల్యేనైనా అడిగారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.