Viral news: తెలంగాణ ఇంటర్ పరీక్ష పేపర్లో ఒక విద్యార్థి ఫన్నీ రాతలు, బొమ్మలు వేశాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పేపర్ పై టీచర్ ను ఉద్దేశించి విద్యార్థి కాళ్లు మొక్కుతా పాస్ చేయండి అంటూ రాశాడు.
తెలంగాణలో ఇంటర్ పరీక్ష పేపర్ల మూల్యాంకనం జరుగుతోంది. ఒక టీచర్ వచ్చిన ఆన్సర్ షీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింద. సాధారణంగా విద్యార్థులు ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సిన చోట, ఈ విద్యార్థి మాత్రం ఎగ్జామినర్‌ను వేడుకుంటూ రాసిన మాటలు, వేసిన బొమ్మలు అందర్నీ నవ్విస్తున్నాయి. ఆ ఆన్సర్ షీట్‌లో “సార్… దయచేసి నన్ను పాస్ చేయండి. మీ కాళ్లు మొక్కుతా” అంటూ విద్యార్థి రాశాడు. ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయలేకపోయానని, ఈ ఒక్కసారి కాపాడాలని కోరాడు. అంతేకాకుండా, ఒక చిన్న బొమ్మ గీసి తన పరిస్థితిని చూపించాడు. ఆ బొమ్మలో టీచర్ కాళ్లపై పడిన విద్యార్థిని గీశాడు. ఆ బొమ్మలు చూస్తే నవ్వాపుకోలేరు. జవాబులు రాయలేకపోయినా బొమ్మలు మాత్రం బాగా వేశాడు.
ఆ విద్యార్థి ఆన్సర్ షీట్లో తన వ్యక్తిగత పరిస్థితిని కూడా వివరించాడు. “నాకు తల్లిదండ్రులు లేరు… గురువులే నా అమ్మానాన్నలు” అంటూ ఎగ్జామినర్ మనసును కదిలించేలా రాశాడు. పరీక్షలో వచ్చిన ప్రశ్నలు తనకు అర్థం కాలేదని, చదివినవి రాలేదని కూడా చెప్పాడు. ఈ మాటలు చదివినవారికి ఒకవైపు నవ్వు తెప్పిస్తున్నాయి. సరిగ్గా చదవకుండా పిచ్చిరాతలు రాశాడని కొంతమంది కామెంట్లు పెట్టారు. ఈ ఆన్సర్ షీట్‌ను చూసిన ఎగ్జామినర్ దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం బయటకు వచ్చింది. వెంటనే ఇది వైరల్ అయింది. నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు “పాపం… పరిస్థితి బాగోలేక ఇలా రాసి ఉండొచ్చు” అంటూ జాలి పడుతుంటే, మరికొందరు “చదవకుండా ఇలా అడగడం సరైంది కాదు” అంటూ విమర్శిస్తున్నారు.
ఈ ఘటన విద్యార్థులపై ఉండే పరీక్షల ఒత్తిడిని మరోసారి గుర్తు చేస్తోంది. చాలా మంది విద్యార్థులు పరీక్షల సమయంలో టెన్షన్‌కు గురవుతారు. ఎంత చదివినా, ఎగ్జామ్ హాల్లోకి వెళ్లిన తర్వాత భయం, ఆందోళన వల్ల రాయలేకపోతుంటారు. అలాంటి పరిస్థితుల్లో కొందరు ఇలాంటి విచిత్రమైన పనులు చేస్తుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పరీక్షలు జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే. వాటిని అత్యంత భయపడాల్సిన అవసరం లేదు. విద్యార్థులు ఒత్తిడిని తగ్గించుకుని, నెమ్మదిగా చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చు. అలాగే తల్లిదండ్రులు, గురువులు కూడా పిల్లలపై అధిక ఒత్తిడి పెట్టకుండా, వారికి మానసికంగా బలాన్ని ఇవ్వాలి.


