కరోనా వైరస్ ఓ కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేసింది. ఇంట్లో అందరినీ బలితీసుకుంది. అందరూ ప్రాణాలు కోల్పోగా.. నిండు గర్భిణి మాత్రం ఒంటరిదైపోయింది. ఈ విషాదకర సంఘటన వరంగల్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వరంగల్ నగరంలోని ఓ ప్రైవేటు కార్యాలయంలో పనిచేసే యువతి.. తన సహోద్యోగిని ప్రేమించింది. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవంతో.. పెద్దలు కూడా వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మంచి ముహూర్తాన వారు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కొంత కాలానికే ఆమె గర్భం దాల్చిందన్న విషయం తెలిసింది. దీంతో.. వారంతా సంబరపడిపోయారు.

కొత్త బుజ్జాయి ఇంట్లో అడుగుపెడుతుందని ఆశపడ్డారు. అంతలోనే వారి జీవితాలను కరోనా వైరస్ తలకిందులు చేసింది. ముందుగా సదరు యువతి భర్తకు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. వెంటనే వరంగల్ ఎంజీఎంలో చికిత్సకు చేరాడు. అక్కడ నుంచి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

అంతలోనే తన అత్త, మామలకు కూడా కరోనా సోకినట్లు తెలిసింది. వారిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంలో చేర్చగా.. మామ గారు చనిపోయారు. అది తట్టుకోలేక అత్త కూడా కన్నుమూసింది. ఆ రెండు మరణాలను సదరు యువతి తట్టుకోలేకపోయింది. అంతలోనే.. హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న భర్త కూడా తుది శ్వాస విడిచాడు. రోజుల తేడాతో.. భర్త, అత్త, మామలను కోల్పోయి సదరు యువతి గుండెలు అవిసేలా ఏడుస్తోంది. కాగా.. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణీ కావడం గమనార్హం. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.