తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు మోస్తరు నుండి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 

హైదరబాద్ : మండిపోతున్న ఎండలతో సతమతం అవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఇవాళ, రేపు(శుక్ర, శని) తెలంగాణలో ఎండలు తగ్గి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో ఈ రెండురోజులు వాతావరణం కాస్త చల్లగావుండి సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయంటూ గుడ్ న్యూస్ చెప్పారు. 

మధ్యప్రదేశ్ నుండి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్ర, శనివారాలు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలుండటంతో ప్రజలు అప్రమత్తంగా వుండాలని అధికారులు హెచ్చరించారు. 

Read More అసలే ఎండలు మండుతున్నాయి...వడదెబ్బ తగలకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా..?

ఇదిలావుంటే గత కొద్దిరోజులుగా తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో మధ్యాహ్నం బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు వడగాలులు తోడవడంతో ప్రజల ఇబ్బందులు మరీ ఎక్కువయ్యాయి. గురువారం నల్గొండలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత, మెదక్ లో రాత్రి అత్యల్పంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. మిగతా జిల్లాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.